శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 15:04:40

టీఎస్ బీపాస్ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం

టీఎస్ బీపాస్ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌‌ టీఎస్ బీపాస్ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భార‌త‌దేశంలోనే శ‌ర‌వేగంగా ప‌ట్ట‌ణీక‌రణ చెందుతున్న రాష్ర్టాల్లో భార‌త‌దేశంలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌న్నారు. దాదాపుగా రాష్ర్టంలో 42 శాతం జ‌నాభా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నివ‌సిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌ట్ట‌ణాల్లో స‌రైన మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్నాం. పుర‌పాల‌న‌లో స‌మూల మార్పులు తేవాల‌నే ఉద్దేశంతో నూత‌న పుర‌పాల‌క చ‌ట్టాన్ని 2019లో తీసుకువ‌చ్చాం. పౌరుడు కేంద్రంగా పార‌ద‌ర్శ‌కంగా సేవ‌లందించాల‌ని రాష్ర్ట ప్ర‌భుత్వం పెట్టుకుంది. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి మున్సిపాలిటీకి జ‌నాభా నిష్ప‌త్తి ప్ర‌కారం నిధులు కేటాయిస్తున్నామ‌ని తెలిపారు.

ప‌ట్ట‌ణంలో నివ‌సించే పౌరులు సొంత ఇల్లు నిర్మించుకోవ‌డానికి తీసుకోవాల్సిన అనుమ‌తుల విష‌యంలో కొన్ని ఇబ్బందులు గ‌మ‌నించాం. అవినీతిని గ‌మ‌నించి 2015లో డెవ‌ల‌ప్‌మెంట్ ప‌ర్మిష‌న్‌ మేనేజ్‌మెంట్ సిస్టం(డీపీఎంఎస్)ను అన్ని మున్సిపాలిటీల్లో ప్ర‌వేశ‌పెట్టాం. దీనికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో 100 శాతం పార‌ద‌ర్శ‌కత తీసుకురావాల‌నే ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు టీఎస్ బీపాస్ చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. 

టీఎస్ బీపాస్ చ‌ట్టం వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. టీఎస్ బీపాస్ చ‌ట్టం కోసం లోతుగా అధ్య‌య‌నం చేశామ‌న్నారు. హైద‌రాబాద్‌తో స‌హా రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీల‌కు ఈ చ‌ట్టం వ‌ర్తిస్తుంద‌న్నారు. 

మున్సిపాలిటీల ప‌రిధిల్లో 75 గ‌జాల లోపు స్థ‌లం ఉన్న వారికి అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. 75 నుంచి 600 గజాల వ‌ర‌కు స్థ‌లం ఉన్న వారు ఇన్‌స్టంట్ ప‌ర్మిష‌న్ తీసుకోవ‌చ్చు. 600 గ‌జాల పైన స్థ‌లం ఉన్న వారు 21 రోజుల్లోనే అన్ని అనుమ‌తులు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 21 రోజుల్లో ప‌ర్మిష‌న్ రాక‌పోతే 22వ రోజు డీమ్డ్ అఫ్రూవ‌ల్ వ‌స్తుంద‌ని పేర్కొన్నారు.  ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇస్తామ‌న్నారు. ఈ బిల్లు అమ‌లు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో మానిట‌రింగ్ సెల్ ఏర్పాటు చేస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. త‌ప్పుడు ప్ర‌దేశంలో నిర్మాణాలు ఉంటే నోటీసులు ఇవ్వ‌కుండానే కూల్చివేస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. చ‌ట్టం ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు భ‌యం, గౌర‌వం ఉండాలి. అన్ని ప‌ట్ట‌ణాల‌కు మాస్ట‌ర్ ప్లాన్లు రూపొందిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.


logo