గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 11, 2020 , 18:09:16

కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం.. ఇకపై రెండు రకాల పాస్‌బుక్‌లు

కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం.. ఇకపై రెండు రకాల పాస్‌బుక్‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు, వీఆర్వో ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల ప‌ద‌వుల ర‌ద్దు బిల్లుకు, పంచాయ‌తీరాజ్ 2020 స‌వ‌ర‌ణ బిల్లుకు, పుర‌పాల‌క చ‌ట్టం 2020 స‌వ‌ర‌ణ బిల్లుకు శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. నూత‌న రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ముగిసిన అనంత‌రం ఈ బిల్లుల‌కు ఆమోదం తెలిపారు. ఈ సంద‌ర్భంగా స‌భ్యులంద‌రూ బ‌ల్ల‌లు చ‌రుస్తూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. నూత‌న రెవెన్యూ బిల్లును ఈ నెల 9వ తేదీన స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లుపై శుక్ర‌వారం సుదీర్ఘంగా చ‌ర్చించారు. స‌భ్యులంద‌రూ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు.

తెలంగాణ రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు మాత్ర‌మే అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ చ‌ట్టంపై స‌భ్యులంద‌రూ ఉత్త‌మ‌మైన స‌ల‌హాలు ఇచ్చారు. రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు అని తేల్చిచెప్పారు. స‌మైక్య రాష్ర్టంలో 160 నుంచి 170 వ‌ర‌కు చ‌ట్టాలు ఉండేవ‌ని సీఎం గుర్తు చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 87 చ‌ట్టాలు ఉన్నాయ‌ని తెలిపారు. ధ‌ర‌ణి మాత్ర‌మే కాదు మిగ‌తా చ‌ట్టాలు ఉంటాయ‌న్నారు. ఆర్‌వోఆర్‌, ధ‌ర‌ణి స‌ర్వ‌స్వం కాదు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించే అంశాల‌ను మాత్ర‌మే తొల‌గిస్తున్నామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. నూత‌న రెవెన్యూ చ‌ట్టం అంతం కాదు.. ఇది ఆరంభం మాత్ర‌మే అని తెలిపారు. చ‌ట్టంలో అన్నీ తీసేయ‌డం లేదు. ప‌లు చ‌ట్టాల స‌మాహారంగా రెవెన్యూ చ‌ట్టం కొనసాగుతుంద‌న్నారు. 

కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా ప్ర‌వేశ‌పెడుతున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే నిర్వ‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌యివేటు అప్ప‌జెప్ప‌బోమ‌ని సీఎం తేల్చిచెప్పారు. రాష్ర్ట ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న టీఎస్‌టీఎస్ కార్పొరేష‌న్ ద్వారా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను నిర్వ‌హిస్తామ‌ని సీఎం పేర్కొన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అస‌వ‌రం లేద‌న్నారు. భూ రికార్డుల విష‌యంలో ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేదు. భూ రికార్డుల‌ను మూడు ర‌కాలుగా స్టోర్ చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ-రికార్డు, డిజిట‌ల్ రికార్డు, డాక్యుమెంట్ రూపంలో భూ రికార్డులు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి వెబ్‌సైట్ ఒకే స‌ర్వ‌ర్ మీద ఆధార‌ప‌డ‌కుండా దేశంలో ఎక్క‌డ భ‌ద్ర‌మైన ప్రాంతాలు ఉంటాయో అక్క‌డ స‌ర్వ‌ర్లు ఉంటాయి. స‌ర్వ‌ర్ల కోసం ఎంత ఖ‌ర్చు అయినా వెనుకాడ‌బోమ‌ని సీఎం పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ భూముల‌కు ఆకుప‌చ్చ పాస్‌బుక్‌, వ్య‌వ‌సాయేత‌ర భూముల‌కు ముదురు ఎరుపు పాస్‌బుక్ ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.  


logo