బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 02:58:09

అమరుడి కుటుంబానికి 5 కోట్లు

అమరుడి కుటుంబానికి 5 కోట్లు

  • సంతోష్‌ భార్యకు గ్రూప్‌1  స్థాయి ఉద్యోగం, ఇంటి జాగా
  • నేనే స్వయంగా వెళ్లి  వారికి సాయం అందజేస్తా
  • ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్‌రావు ప్రకటన 
  • గల్వాన్‌ ఘటనలో మరో 19 మంది అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం

హైదరాబాద్‌/సూర్యాపేట/బొడ్రాయి బజార్‌, నమస్తే తెలంగాణ: రక్తం గడ్డకట్టే చలిలోనూ నెత్తురును ధారపోస్తూ, దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం సరిహద్దుల్లో ప్రాణాలను అర్పిస్తున్న వీర జవాన్లకు, వారి కుటుంబాలకు యావత్తు దేశం అండగా నిలువాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, ఇంటి జాగాతోపాటు ఆయన భార్యకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్‌బాబు ఇంటికి వెళ్లి సహాయం అందిస్తానని తెలిపారు.

అంతేకాదు.. గల్వాన్‌ ఘర్షణల్లో ప్రాణాలు అర్పించిన 19 మంది సైనిక కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని వెల్లడించారు. ఈ మొత్తాన్ని కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. చైనా దురాగతాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులకు, వారి కుటుంబాలకు దేశం అండగా నిలువాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సైనికుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు, వారి కుటుంబాల్లో భరోసా నింపేందుకు యావత్తు దేశం వారి వెన్నంటే ఉండాలని పిలుపునిచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే సింబల్‌ ఆఫ్‌ యూనిటీని ప్రదర్శించాలన్నారు. దేశమంతా సైనికుల వెంటే ఉందన్న సందేశాన్ని పంపాలని వ్యాఖ్యానించారు. వీరమరణం పొం దిన సైనిక కుటుంబాలను కేంద్రంతోపాటు రాష్ర్టాలు కూడా ఆదుకోవాలన్నారు. అప్పుడే సైనికులకు, వారి కుటుంబసభ్యులకు దేశం తమవెంట నిలుస్తున్నదన్న నమ్మకం కుదురుతుందని చెప్పారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులన్నా మిగతా ఖర్చులు తగ్గించుకొనైనా సైనికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. 

సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్తు దేశం అండగా నిలువాలి. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం నింపాలి. వారి కుటుంబాలకు భరోసానివ్వాలి. దేశమంతా మీ వెంటే ఉన్నదనే సందేశం ఇవ్వాలి. అమరజవాన్ల కుటుంబాలకు రాష్ర్టాలూ సహాయ సహకారాలు అందించాలి. 

- అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్‌


logo