బుధవారం 08 జూలై 2020
Telangana - May 26, 2020 , 02:47:17

విత్తన వైభవం

విత్తన వైభవం

  • రాష్ట్రంలో 3 లక్షలకు పైగా రైతులకు ఉపాధి
  • విత్తన సాగుకు అనువైన నేలలు రెండే రెండు 
  • ఒకటి అమెరికాలోని అరిజోన.. రెండోది తెలంగాణ
  • ప్రస్తుతం 7 లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి 
  • సాగును 10 లక్షల ఎకరాలకు పెంచితే 
  •  విత్తన భాండాగారంగా రాష్ట్రం
  • దేశ డిమాండ్‌లో 63% ఇక్కడే ఉత్పత్తి
  • ఏటా 6000 కోట్ల ఆదాయం

విత్తు కొద్దీ పంట అంటారు! ఒక పంట దిగుబడిని నిర్ణయించేది మేలైన విత్తనం! అటువంటి మేలైన విత్తనాలను పండించేందుకు అనువైన ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా రెండే ఉన్నాయి! ఒకటి అమెరికాలోని  అరిజోన.. రెండోది మన తెలంగాణ! ప్రకృతి ప్రసాదించిన అనువైన వాతావరణం.. భౌగోళిక పరిస్థితులతో తెలంగాణ విత్తన వైభవాన్ని చవిచూస్తున్నది. ఏటా దేశం మొత్తంలో నాటుకుంటున్న విత్తనాల్లో 63శాతం మనవే! 420కిపైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ నేల గొప్పతనాన్ని గుర్తించి.. ఇక్కడే కేంద్రాలు నెలకొల్పి పరిశోధనలు చేస్తున్నాయి. ప్రస్తుతం 7 లక్షల ఎకరాల్లో ఉన్న విత్తనసాగు.. 10 లక్షల ఎకరాలకు పెరిగితే.. ఇక తెలంగాణ విత్తన వైభోగమే!!


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సాధారణంగా భూములు ప్రాంతాలను బట్టి కొన్ని పంటలకు అనుకూలంగా ఉంటాయి. కానీ విత్తనోత్పత్తికి ఒక రాష్ట్ర భౌగోళిక ప్రాంతం అనువుగా ఉండటమనేది చాలా అరుదైన విషయం. ప్రపంచంలో విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలమైన ప్రాంతాలు రెండు మాత్రమే ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అందులో అమెరికాలోని అరిజోన ఒకటికాగా, మరొకటి మన తెలంగాణ. అందుకే ఉద్యమకాలం నుంచి సీఎం కేసీఆర్‌ తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని ప్రకటించారు. ఆ దిశగా ఇప్పటికే రాష్ట్రం విజయవంతంగా ముందుకుపోతున్నది. 

పగలు ఎక్కువ సమయంతోపాటు పుష్కలమైన సూర్యరశ్మి అందుబాటులో ఉండటం తెలంగాణ వాతావరణం ప్రత్యేకత. దీంతోపాటు పొడిగా ఉండే చల్లని వాతావరణం.. పుప్పొడి రేణువుల అందుబాటుకు, ఫలదీకరణకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గాలిలో తేమశాతం తక్కువగా ఉండ టం వల్ల విత్తన పంటలకు చీడపీడల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నందున సేద్యపు పను లు కూడా సులభంగా ముందుకుసాగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. విత్తన కోత.. ఆపై శుద్ధి, ప్యాకింగ్‌.. ఇలా సకల సౌకర్యాలు, ఇన్ని అనుకూలతలు తెలంగాణలో ఉన్నందునే విత్తనోత్పత్తికి రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారింది. ఇతర ప్రాంతాలు విత్తనోత్పత్తికి అంతగా అనుకూలంగా లేకపోవడంతో ఇందుకు అయ్యే ఖర్చు మన రాష్ట్రంలోకంటే 3 రెట్లు అధికమవుతుంది.

10 లక్షల ఎకరాలకు పెంచాలి


రాష్ట్రంలో విత్తనోత్పత్తి విస్తీర్ణాన్ని ఇంకా పెంచేందుకు అనువైన పరిస్థితులున్నాయి. ప్రస్తు తం 7 లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి అవుతున్నది. దీనిని 10 లక్షల ఎకరాలకు పెంచితే తెలంగాణ విత్తన భాండాగారంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ జల సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తూ కాల్వల ద్వారా నీరు సరఫరా పెరిగినందున విత్తనోత్పత్తికి పరిస్థితులు మరింత అనుకూలించి దిగుబడి కూడా అధికమవుతుంది. ప్రభు త్వం నియంత్రిత సేద్యంలో భాగంగా విత్తనోత్పత్తి విస్తీర్ణాన్ని కూడా పెంచేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ప్రధానంగా కూరగాయలకు సంబంధించి విత్తనోత్పత్తి ద్వారా రైతులు ఆర్థికంగా సమృద్ధి సాధిస్తారు.

- డాక్టర్‌ పిడిగం సైదయ్య, ఉద్యాన వర్సిటీ ప్రొఫెసర్‌

అంతర్జాతీయ దిశగా మన మిరప


ఎండు మిరప రకాల్లో అన్నింటికంటే చాలా మేలైన ప్రత్యేక రకం వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పండుతున్నది. ఈ రకం విత్తనం ఏ సంస్థ తయారు చేయకపోగా.. రైతులే దాదాపు 45 ఏండ్లుగా సాగుచేస్తుండటం ఓ అద్భుతం. నర్సంపేట మండలంలో 2,100 ఎకరాల్లో, నల్లబెల్లి మండలంలో 2,800 ఎకరాల్లో రైతులు ఎండు మిర్చి సాగుచేస్తూ గుజరాత్‌, నాగ్‌పూర్‌, ఢిల్లీ ప్రాంతాలకు ఎగుమతిచేస్తున్నారు. ఈ ప్రాంతాల్లోనే దాదాపు 15 వేల టన్నుల ఎండు మిర్చి ఉత్పత్తి అవుతున్నది. వరంగల్‌ చపాటా లేదా పాప్‌డాగా అభివర్ణించే ఈ ఎండు మిర్చిని స్థానికంగా టమాట మిరప అని పిలుస్తారు. స్వతహాగా ప్యాఫ్రికా గ్రూపునకు చెందిన ఈ మిరపకాయలు మెత్తగా, పెద్దవిగా ఉంటాయి. ప్రధానంగా ఎరుపురంగు ద్రావణం అయిన బలియోరెసిన్‌ వెలికి తీయడానికి దీనిని ఉపయోగిస్తారు. బేవరేజ్‌లు, ఆహారశుద్ధి పరిశ్రమ, రెస్టారెంట్లు, పచ్చళ్లకు విరివిగా వినియోగిస్తుండటంతో వీటికి డిమాండ్‌ ఎక్కువ. ఘాటును తెలిపే ఎస్‌హెచ్‌యూ సుమారు 4000-6000 యూనిట్ల వరకు, రంగును తెలిపే ఆస్థా విలువ 100-140 యూనిట్లుగా ఉంటుంది. ఇక్కడి పండిన పంటలోనే రైతులు కొన్ని ఆరోగ్యకరమైన, రంగుతో కూడిన కాయలను మొక్కలపైనే ఉంచి, ఎండబెట్టి విత్తనంగా వాడుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ మిరప విత్తనానికిగాను భౌగోళిక గుర్తింపునకు అవకాశం ఉండటంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పత్తి విత్తనోత్పత్తిలో మనమే మేటి

1. దేశవ్యాప్తంగా 5.80 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు ఉత్పత్తి అయితే అందులో 2.21 కోట్ల పైచిలుకు విత్తన ప్యాకెట్లు మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుండటం ఇక్కడి విత్తనోత్పత్తి సామర్థ్యానికి          నిదర్శనం. 

2. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న నియంత్రిత సాగు విధానంలో భాగంగా వచ్చే వానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు రంగం సిద్ధం       చేశారు. 

3. ఎకరాకు 2 ప్యాకెట్లు (ఒకటి 450 గ్రా ములు) 1.40 కోట్ల ప్యాకెట్లు అవసరమవుతాయి. అంటే విత్తనోత్పత్తి డిమాండ్‌కు దాదాపు రెట్టింపుస్థాయిలో ఉన్నది. 

4. సుమారు 70 విత్తన సంస్థలు రాష్ట్రంలో ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. మహారాష్ట్రలోని జాల్నా, తమిళనాడులోని అథూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, ఏలూరు, కర్ణాటకలోని       గజేంద్రగఢ్‌, గుజరాత్‌లోని బొడెల్లీస్కే ప్రాంతాల్లో పత్తి విత్తనోత్పత్తి కొనసాగు    తున్నది. 

5. ఉత్పత్తి పరిమాణం, ప్యాకెట్ల సంఖ్యాపరంగా తెలంగాణ మొదటిస్థానంలో ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్‌ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 

6. గతంలో మహారాష్ట్రలోని పుణె, కర్ణాటకలోని బెంగళూరు, ఏపీలోని ఏలూరులో విత్తన సంస్థలు చాలావరకు ఉండేవి. 

7. ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా దాదాపు 420కి పైగా జాతీయ, అంతర్జాతీయ విత్తన సంస్థలు పనిచేస్తున్నాయి. గత ఏడాది ఈజిప్టు, సుడాన్‌, పిలిప్పీన్స్‌, టాంజానియా, ఇటలీ తదితర దేశాలకు 6,800 క్వింటాళ్ల మేర వడ్లు, మక్కలు, జొన్న, పొద్దుతిరుగుడు, సజ్జల విత్తనాలను తెలంగాణ ఎగుమతి చేసింది.

ప్రపంచవ్యాప్తంగా విత్తనోత్పత్తి రంగం ఇలా..

విత్తన మార్కెట్‌ విలువ: 4,53,796 కోట్లు

7.9% విత్తన మార్కెట్‌ విలువ: 6,86,812 కోట్లు

2024 నాటికి పెరుగుదల

4% విత్తన ఉత్పత్తిలో భారత్‌ వాటా

అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నవి: ధాన్యం, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు.

భారతదేశంలో విత్తన మార్కెట్‌ విలువ: 31,160 కోట్లు

హైబ్రీడ్‌ మిర్చి విత్తనాలు కిలో రూ.లక్ష,టమాట విత్తనాలు రూ. 60 వేలు!

తెలంగాణలో విత్తనోత్పత్తి ఇలా..

ఏటా విత్తన వ్యాపారం: 6,000 కోట్ల రూపాయలు

ఉత్పత్తి: దేశానికి సాలీనా అవసరం

35 లక్షల టన్నులు

తెలంగాణ నుంచి 22 లక్షల టన్నులు

అంటే దాదాపు ఇక్కడి నుంచే 63%

ప్రధాన ఉత్పత్తులు: వరి, బీటీ పత్తి, జొన్న, కూరగాయలు,పొద్దుతిరుగుడు, సజ్జలు,మక్కజొన్న.

పండిస్తున్న జిల్లాలు: ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌

ఉపాధి ఇలా..

రైతులు , 3లక్షలు

కూలీలు, 2 లక్షలు

నిపుణులు , 50 వేలు

వ్యాపారులు, 50 వేలు

బీటీ పత్తి: దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న 5.80 కోట్ల ప్యాకెట్లలో తెలంగాణలోనే 2.21 కోట్ల పైచిలుకు.


logo