సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 01:50:16

మా అభ్యంతరాలను వినండి ... తెలంగాణ అఫిడవిట్‌

మా అభ్యంతరాలను వినండి ... తెలంగాణ అఫిడవిట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక లోపభూయిష్టంగా ఉన్నదని, ట్రిబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేలా ఉన్నదని తెలంగాణ పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా కమిటీ తప్పుల తడకగా నివేదిక ఇచ్చిందని తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా తీర్పు ఇవ్వవద్దని, తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చెన్నై ధర్మాసనంలో అఫిడవిట్‌ దాఖలుచేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై జీ శ్రీనివాస్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. ఆ ప్రాజెక్టుపై ముందుకుపోవద్దని మే 20న ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో దీనిపై సమగ్ర పరిశీలనచేసి నివేదిక సమర్పించాలని సూచిస్తూ సంయుక్త కమిటీని నియమించింది. తదుపరి జరిగిన విచారణలో గతంలో ఇచ్చిన తీర్పును సవరించి.. టెండర్ల నిర్వహణకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 8న సంయుక్త కమిటీ నివేదిక సమర్పించగా... 11వ తేదీన మరోసారి విచారణ చేపట్టిన ట్రిబ్యునల్‌ తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు వినాలని, విచారణను తిరిగి ప్రారంభించాలని ట్రిబ్యునల్‌ను కోరింది. అందులోని కొన్ని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి...

  • తెలంగాణ అధికారులను భాగస్వాములను చేయకుండానే కమిటీ జూలై 29న ఏపీ జలవనరులశాఖ అధికారులతో సమావేశమైంది. ఏపీ అధికారులు పేర్కొన్న అంశాలనే పరిగణనలోకి తీసుకొని నివేదికను పొందుపర్చారు.
  • రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 111 టీఎంసీల కేటాయింపు ఉన్నదని కమిటీ పేర్కొన్నది. కానీ, ఈ కేటాయింపులు ఉన్నట్టు ఏవైనా ఉత్తర్వులుగానీ, ట్రిబ్యునల్‌ అవార్డులు ఉన్నాయా? అనే అంశాలను కమిటీ పరిశీలించలేదు. 
  • తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు-నగరి ప్రాజెక్టులకు నీటినందించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపడుతున్నారని పేర్కొన్న కమిటీ.. ఈ పథకాలన్నింటికీ వేర్వేరుగా పర్యావరణ అనుమతులు తీసుకొన్నట్టు కూడా తెలి పింది. మరి వాటికి వేర్వేరుగా అనుమతులు తీసుకున్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట మళ్లీ 111 టీఎంసీల కేటాయింపు ఎలా జరుగుతుంది?
  • పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ప్రవాహ సామర్థ్యాన్ని 100 క్యూసెక్కుల నుంచి 11,150కి, ఆపై 44 వేల క్యూసెక్కులకు పెంచడంపై బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ఎదుట పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం 80వేల క్యూసెక్కులకు పెంచేందుకు సిద్ధమవడం అన్యాయం. 
  • ఒకచోట రాయలసీమ ఎత్తిపోతల పథకం శ్రీశైలం ప్రాజెక్టులో అంతర్భాగమని పేర్కొన్న కమిటీ.. మరోచోట కృష్ణా బోర్డు నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నదని తెలిపింది. అంటే.. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు అనేది స్పష్టమవుతున్నది.


logo