సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 02:22:12

తెలంగాణ చర్యలు భేష్‌

తెలంగాణ చర్యలు భేష్‌

  • అభివృద్ధిచెందిన దేశాలకంటే ముందంజ 
  • ఈ అప్రమత్తతవల్లే స్థానికులకు వ్యాధి సోకలేదు 
  • కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ అధికారుల ప్రశంస

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడి చర్యల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిచెందిన దేశాలకంటే ముందంజలో ఉన్నదని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రశంసించింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై కంటే హైదరాబాద్‌లోనే వ్యాధి నివారణ చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఆయుష్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ పీవీవీ ప్రసాద్‌, రిసెర్చ్‌ అధికారి డాక్టర్‌ సాకేత్‌రాం తిగుళ్ల కొనియాడారు. ‘అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్‌కార్డు ఉంటేనే కొవిడ్‌-19 పరీక్షలు చేస్తున్నారు. కానీ ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని మోస్తున్నది. హైదరాబాద్‌కు ఎంతోమంది విదేశీయులు వస్తుంటారు. వారిని పరీక్షించేందుకు కేంద్రాలు ఏర్పాటుచేశారు. రిపోర్టులు 24 గంటల్లోపే వస్తున్నాయి. స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికా వంటి దేశాలకంటే తెలంగాణ ప్రభుత్వమే ముందుగా స్పందించింది. ఈ అప్రమత్తత వల్లే స్థానికు లెవరీ కరోనా పాజిటివ్‌ రాలేదు. విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చినవారిలోనే ఆ లక్షణాలు కనిపించాయి’అని అన్నారు.

సొంతంగా వైద్య పరీక్షలు

విదేశీ ప్రయాణంచేసి వచ్చిన డాక్టర్‌ సాకేత్‌రాం తిగుళ్ల గాంధీ దవాఖానకు స్వయంగా వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ‘నేను ఢిల్లీలో ఫ్లైట్‌ దిగగానే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు. జ్వరం లేదని తేలింది. ఢిల్లీలోనే వారంపాటు ఉండి హైదరాబాద్‌ వచ్చాను. అంతకుముందున్న దగ్గు కొంచెం ఎక్కువ కావడంతో గాంధీకి వెళ్లాను. వారు వెంటనే చేర్చుకొని, బ్లడ్‌ శాంపిల్‌ సేకరించారు. 24 గంటల్లోనే రిపోర్టు నెగెటివ్‌ అని వచ్చింది. హైదరాబాద్‌లోని కాల్‌సెంటర్‌ కూడా బాగా పనిచేస్తున్నది. ఏ మాత్రం లేట్‌ చేసినా ఇబ్బంది పడేవాళ్లం’ అని చెప్పారు.


logo