శనివారం 11 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:26:35

ఐదేండ్లలో రాష్ర్టానికి రూ.2 లక్షల కోట్లు

ఐదేండ్లలో రాష్ర్టానికి రూ.2 లక్షల కోట్లు

 • పెట్టుబడులు 2 లక్షల కోట్లు
 • పెట్టుబడుల ఆకర్షణకు ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’వెబ్‌సైట్‌
 • 12 వేల పరిశ్రమలు..14 లక్షల మందికి ఉపాధి
 • పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ 
 • లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగాలకు అడ్డాగా హైదరాబాద్‌
 •  లెదర్‌ పార్కుల ద్వారా రెట్టింపైన ఆదాయం 
 • పారిశ్రామిక గతిని మార్చిన టీఎస్‌ఐపాస్‌ 
 • చేనేతకు పెద్దపీట.. అంతరిస్తున్న డిజైన్లకు పూర్వవైభవం 
 • ఈ ఏడాది 526 పరిశ్రమలకు 1520 ఎకరాల భూమి.. 
 • రూ.4,859 కోట్ల పెట్టుబడులు, 8,500 మందికి ఉపాధి
 • కొద్దికాలంలో 46వేల కోట్ల పెట్టుబడులు, 
 • 83వేల మందికి ఉద్యోగాలు.. 
 • ఇతర రాష్ర్టాలు, దేశాల్లో రోడ్‌షోలు, సదస్సులు 

కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. రాష్ర్టానికి అతి కొద్దికాలంలో రూ.45,848 కోట్ల పెట్టుబడులు మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ రూపంలో రానున్నాయి. వీటి ద్వారా 83వేల ఉద్యోగాలు లభించే అవకాశముంది. జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్‌ మరోసారి ప్రథమ ర్యాంకును ధించింది. - ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 

 • ఐదేండ్లలో టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ర్టానికి వచ్చిన పరిశ్రమలు 
 • మొత్తం పెట్టుబడులు 1,96,404 కోట్లు
 • పరిశ్రమల సంఖ్య 12,021
 • ఉపాధి అవకాశాలు 13,90,361

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ గత ఐదేండ్లలో పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌ను ఆవిష్కరించిన తరువాత ఐదేండ్లలో 12వేల వరకు పరిశ్రమలు, రూ. 2 లక్షల కోట్ల విలువైన పెట్టుడులు వచ్చాయి. తెలంగాణ పారిశ్రామికరంగాన్ని టీఎస్‌ఐపాస్‌ మార్చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. టీఎస్‌ఐపాస్‌ ఇతర రాష్ర్టాలకు, దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో నిరంతరం సంస్కరణలు తేవడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈవోడీబీలో నేడు తెలంగాణ ఇతర రాష్ర్టాలకన్నా ముందంజలో ఉన్నదని చెప్పారు. రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య విభాగం నివేదికను మంత్రి కేటీఆర్‌ మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ద్వారా ఈ ఏడాది 526 పరిశ్రమలకు 1520 ఎకరాల భూమిని కేటాయించామని మంత్రి తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా రూ.4,859 కోట్ల పెట్టుబడులు వస్తాయని, సుమారు 8,500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. వృద్ధిరేటులో తెలంగాణ తన ఆధిక్యాన్ని కొనసాగించింది.


జాతీయ సగటు వృద్ధిరేటు 7.5 శాతం మాత్రమే ఉండగా, తెలంగాణ తన అత్యధిక వృద్ధి రేటు 12.6 శాతాన్ని మరోసారి నిలబెట్టుకున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది. జీడీపీలో తెలంగాణ వాటా 21 బేసిస్‌ పాయింట్లు పెరిగింది. ఇది 2018-19లో 4.55 శాతం ఉండగా, 2019-20లో 4.76 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయంలోనూ జాతీయ సగటు రూ.1,34,432 ఉండగా, తెలంగాణలో రూ.2,28,216గా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందని చెప్పారు. కరోనా ద్వారా ఏర్పడిన సంక్షోభాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. తెలంగాణకు అతి కొద్దికాలంలో రూ.45,848 కోట్ల పెట్టుబడులు మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ రూపంలో రానున్నాయని ఆయన తెలిపారు. వీటి ద్వారా 83వేల ఉద్యోగాలు లభించే అవకాశముందని చెప్పారు. జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్‌ మరోసారి ప్రథమ ర్యాంకును సాధించిందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు రూ.150కోట్లను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చాయని ఆయన తెలిపారు. 

టీఎస్‌ఐపాస్‌ ద్వారా 2లక్షల కోట్ల పెట్టుబడులు


టీఎస్‌ఐపాస్‌ రాష్ట్ర పారిశ్రామికరంగాన్ని గొప్ప మలుపుతిప్పింది. సీఎం కేసీఆర్‌ పారిశ్రామికవేత్తలు ఇంట్లోనే ఉండి దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో అనుమతి వచ్చే విధంగా చట్టాన్ని రూపొందించారు. ఒకవేళ 15 రోజుల్లో అనుమతి రాకుంటే 16వ రోజున డీమ్డ్‌ టు అప్రూవల్‌ విధానంలో దీనిని రూపొందించారు. 2015లో ప్రారంభమైన టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 12వేల పరిశ్రమలు రాగా రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 

భవిష్యత్‌ ప్రణాళిక

రాష్ట్రంలో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పేరుతో ఇంకా భారీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో చైనా నుంచి తరలిపోనున్న పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఇన్వెస్ట్‌ తెలంగాణలో భాగంగా ఇతర రాష్ర్టాలు, దేశాల్లో రోడ్‌షోలు, పెట్టుబడుల సదస్సులు, పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహించనున్నారు. 

చేనేత, జౌళి రంగాలు

రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఎక్కువగా ఉపాధి దొరికే రంగం వస్త్ర పరిశ్రమ. చేనేత కళాకారులకు చేతినిండా పని దొరుకాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అనేక పథకాలను రూపొందించింది. నేతన్నకు చేయూత పథకం ద్వారా చేనేత కళాకారులు తమ నెలవారీ వేతనంలో 8 శాతం పొదుపు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో 16 శాతం వారి ఖాతాలో జమచేస్తుంది. నేతన్నకు చేనేత మిత్ర ద్వారా వారికి అవసరమయ్యే నూలు ధరలో 10 శాతం కేంద్రం ఇస్తుండగా, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నది. గొల్లభామ చీరె, తెలియా రుమాల్‌, పితాంబరి చీరెలు, ఆర్మూర్‌ చీరెలు, మహదేవ్‌పూర్‌ సిల్క్‌, వరంగల్‌ డర్రీస్‌లు ఇలా అంతరించిపోతున్న డిజైన్లను వెలుగులోకి తీసుకొస్తున్నారు. టెక్స్‌టైల్స్‌ ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ వరంగల్‌ జిల్లాలో మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడ అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన కొరియా సంస్థ ‘యంగ్‌వన్‌' కంపెనీ రూ.960 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. పాశమైలారంలోనూ మరో టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటుచేస్తున్నారు. సిరిసిల్ల అపారెల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లో తమ యూనిట్‌ను నెలకొల్పడానికి షాపర్స్‌స్టాప్‌ ముందుకొచ్చింది. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న వెల్‌స్పన్‌ కంపెనీ రూ.115కోట్ల పెట్టుబడితో కార్పెట్‌, టైల్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. సిరిసిల్లలో వీవింగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు.

 లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో

లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగాలకు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. ఈ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. జీనోమ్‌ వ్యాలీతో పాటుగా 19వేల ఎకరాల్లో ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తున్నది. సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో 800 ఫార్మా, బయోటెక్‌ , మెడికల్‌ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. జీనోమ్‌ వ్యాలీని మరింత విస్తరించనున్నారు. దీనికి ఐలా హోదాను ఇచ్చారు. జీనోమ్‌ వ్యాలీలో ఇప్పటికే 200 ప్రపంచ, జాతీయస్థాయి బయోటెక్నాలజీ కంపెనీలున్నాయి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 276 ఎకరాల్లో ఏర్పాటుచేసిన మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌లో ఇప్పటికే 25 కంపెనీలు తమ యూనిట్లను ప్రారంభించాయి. సహజానంద మెడికల్‌ టెక్నాలజీ సంస్థ రూ.250కోట్ల పెట్టుబడులతో ఆసియాలోనే అతిపెద్ద స్టంట్‌ తయారీ యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పింది. తెలంగాణలో బయోటెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. నోవార్టీస్‌ సంస్థ బయోమీ ఇండియాను ఏర్పాటు చేయనుంది.

కాలుష్యాన్ని అరికట్టేందుకు 

శిలాజ ఇంధన వినియోగాన్ని నివారించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో రాబోయేది అంతా ఎలక్ట్రికల్‌ వాహనాల కాలమేనని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక పాలసీని రూపొందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి మూడు కంపెనీలు ముందుకొచ్చాయి. 325 ఎలక్ట్రిక్‌ బస్సులను హైదరాబాద్‌, వరంగల్‌కు కేటాయించారు. దీనికి కోసం 138 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేశారు. మరోవైపు తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ద్వారా ఖాయిలా పడిన వాటిలో 18 యూనిట్లను పునరుద్ధరించారు. మరో 11 యూనిట్లను రివైవ్‌ చేస్తున్నారు. వీటి ద్వారా 490 మంది తిరిగి ఉపాధి పొందగలిగారు.  

పారిశ్రామిక పార్కులు


తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నూతన పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. గత ఏడాది 526 పరిశ్రమలకు 1520 ఎకరాలను కేటాయించారు. వీటి ద్వారా రూ.4,859 కోట్ల పెట్టుబడులు రాగా 8,562 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. టీఎస్‌ఐఐసీ రాష్ట్రవ్యాప్తంగా 153 పారిశ్రామిక పార్క్‌లను అభివృద్ధిచేసింది. ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఏర్పాటుచేస్తున్న ఐటీ హబ్‌లను టీఎస్‌ఐఐసీ నిర్మిస్తున్నది. టీ-హబ్‌, ఇమేజ్‌ టవర్‌ లాంటి అనేక ప్రతిష్ఠాత్మకమైన నిర్మాణాలను ఈ సంస్థ చేపడుతున్నది. ఏరోస్పేస్‌ రంగానికి కూడా ప్రభుత్వం పెద్దఎత్తున సహాకారం, ప్రోత్సాహం ఇస్తున్నది. హైదరాబాద్‌లో అనేక ఫ్లయింగ్‌ స్కూల్స్‌, ఇంజినీర్ల ట్రెయినింగ్‌ సెంటర్స్‌, మెయింటనెన్స్‌ రిపేర్‌ ఓవరాలింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ను శంషాబాద్‌లో ఏర్పాటుచేశారు. లాజిస్టిక్స్‌, ట్రేడ్‌ రంగంలో 2018లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ 2019లో 8వ స్థానానికి చేరుకుంది. 

రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలుముఖ్యమైన రంగం

రానున్న పెట్టుబడులు కోట్ల రూపాయల్లో

ఉపాధి
1. 
ఐటీ
25,000
1425
2.
 ఆటోమొబైల్‌
450
1200
3.
 స్టీల్‌, బిల్డింగ్‌ మెటీరియల్‌
764
1556
4. 
టెక్స్‌టైల్స్‌
650
1500
5. 
ఎలక్ట్రానిక్స్‌
16,892
73,750
6. 
లైఫ్‌ సైన్సెస్‌
1200
1000
7. 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌
892
2613

మొత్తం
45,848
83,044

దేశంలో తెలంగాణ

 • 2019 ఎస్డీజీఐ ఇండెక్స్‌ వృద్ధిలో.. సుస్థిర ఆర్థికాభివృద్ధి, డీసెంట్‌ వర్క్‌, ఉత్తమ ప్రతిభ కనపర్చిన రాష్ట్రంగా తెలంగాణను యూఎన్డీపీ ఇండియా ప్రకటించింది. 
 •  దేశంలో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్‌ 2019లో ప్రకటించింది. 
 • ఎస్డీజీఐ-2019లో తెలంగాణ 67 స్కోర్‌తో దేశంలో మూడో ర్యాంకు సాధించింది. 2018లో ఈ స్కోర్‌ 61 ఉండగా ఆ తరువాతి సంవత్సరానికి మరో ఆరు పాయింట్లు పెరిగాయి. 
 • రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్రాజెక్టుల్లో వినియోగదారుల అనుభవంలో మొదటి స్థానం లభించగా, ఓవరాల్‌ స్టేట్స్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ అట్రాక్టివ్‌నెస్‌ ఇండెక్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. 
 • ప్రపంచ వాణిజ్య సమాఖ్య నిర్వహించిన మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా ప్రపంచంలోని 30 నగరాల్లో హైదరాబాద్‌ నగరం రెండో స్థానం సాధించింది.
 • 130 నగరాలపై జేఎల్‌ఎల్‌ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌ మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా నిలిచింది.

రాష్ట్రంలో ప్రతిపాదిత మినీ లెదర్‌ పార్కులు 

ప్రాంతం
జిల్లా 
స్థలం (ఎకరాల్లో)
పోలేపల్లి
మహబూబ్‌నగర్‌
25.00
దెండెంపల్లి
నల్లగొండ
25.06
మందమర్రి
మంచిర్యాల
24.00
జింకుంట
నాగర్‌కర్నూలు
25.00
రుక్మాపూర్‌
కరీంనగర్‌
40.01
మల్లెమడుగు
ఖమ్మం
25.13


లెదర్‌ పార్కులు 

తోళ్ల పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన గురుకులాలు, మైనార్టీ, బీసీ సంక్షేమ గురుకులాల విద్యార్థులకు, న్యాక్‌లో శిక్షణ పొందే వారికి అవసరమయ్యే బూట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇటీవల దీని ఆదాయం గణనీయంగా పెరిగింది. 2017-18లో రూ.8.60కోట్లు ఉండగా 2019-20లో రూ.18.32కోట్లుకు చేరింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మినీ లెదర్‌ పార్కులు, మెగా లెదర్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌సిట్యూట్‌ (సీఎల్‌ఆర్‌ఐ)తో చర్చలు జరిగాయి. సీఎల్‌ఆర్‌ఐ ఆరు మినీ లెదర్‌ పార్కులను అభివృద్ధి చేయడానికి అంగీకరించింది. పెట్టుబడుల గమ్యస్థానం ఐదేండ్లలో రాష్ర్టానికి రూ.2 లక్షల కోట్లు ఐదేండ్లలో logo