మంగళవారం 07 జూలై 2020
Telangana - Feb 17, 2020 , 03:12:29

తెలంగాణ స్వయంసమృద్ధం

తెలంగాణ స్వయంసమృద్ధం
  • దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ వాటా కీలకం
  • తెలంగాణకు నిధుల విడుదలలో వివక్షలేదు
  • జమ్ముకశ్మీర్‌ విభజన వల్లే రాష్ర్టాలకు పన్నుల వాటా తగ్గించాం
  • తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడలేదు
  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టీకరణ
  • 14వ ఆర్థికసంఘం సిఫారసుల బుట్టదాఖలుపై మౌనం

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ సంపద వాటా కీలకమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తన పరిధికి లోబడి తగిన సహకారాన్ని అందిస్తున్నదని, తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరించడంలేదని  చెప్పారు. తెలంగాణకు 14వ ఆర్థికసంఘం సిఫారసుల ప్రకారం నిధులెందుకు కేటాయించలేదు? ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ) సర్దుబాటులో ఎందుకు జాప్యమవుతున్నది? అన్న ప్రశ్నలకు ఆమె స్పష్టమైన సమాధానాలివ్వకుండా దాటవేశారు. 


జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు వల్ల భారీగా నష్టపోతున్న కర్ణాటక, తెలంగాణ, మిజోరం లాంటి రాష్ర్టాలకు పరిహారం ఇవ్వాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసుపై సాంకేతికపరమైన అభ్యంతరాలున్నందున మరోసారి పరిశీలించి స్పష్టత ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌ 2020-21పై వ్యాపార, వాణిజ్య, ఇతర వర్గాలతో ఆదివారం హైటెక్‌సిటీలోని ట్రైడెంట్‌ హోటల్‌లో జరిగిన చర్చలో నిర్మలాసీతారామన్‌ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ర్టాలకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి  తగ్గించాలన్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిది కాదన్నారు. 


ఇటీవల జమ్ముకశ్మీర్‌ విభజనతో ఒక రాష్ట్రం తగ్గి రెండు కేంద్ర పాలితప్రాంతాలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల మేరకు ఒక శాతం తగ్గించామని, తెలంగాణకు అన్యాయం చేయాలన్న తలంపు కేంద్రానికి ఏనాడూ లేదని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ స్వయంసమృద్ధిని సాధించిందని, సంపదను పెంచుతున్న తెలంగాణ.. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న విషయాన్ని అంగీకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక క్రమశిక్షణ వల్ల తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) పరిమితి 3 నుంచి 3.5 శాతానికి పెరిగిందని గుర్తుచేశారు. ఆర్థిక స్తోమతను అనుసరించి ఎక్కువ రుణాలను తీసుకునేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. 


కేంద్రం నుంచి తమకు రావాల్సిన వాటాను గట్టిగా  అడిగే హక్కు తెలంగాణకు బిల్‌కుల్‌ ఉన్నదని, కానీ అన్ని రాష్ర్టాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం కేంద్రం నిధులిస్తుందన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని ఆమె కోరారు. గతంతో పోలిస్తే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణకు కేంద్ర పన్నుల వాటాగా 128 శాతం ఎక్కువ నిధుల విడుదలయ్యాయన్నారు. 2010 నుంచి 2015 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతానికి కేంద్ర పన్నుల వాటాగా రూ.46,744 కోట్లు విడుదలవగా.. 2015 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు రూ.1,06,600 కోట్లు విడుదల చేశామని, ఇది గతంతో పోలిస్తే 128 శాతం ఎక్కువని తెలిపారు. జీఎస్టీ వసూళ్లు తగ్గడంవల్ల నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతున్నదని ఆమె అంగీకరించారు. 


అన్ని రాష్ర్టాలతోపాటే తెలంగాణకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరిగిందని, ఇది ఏ రాష్ర్టానికి ప్రత్యేకం కాదని చెప్పారు. ఐజీఎస్టీ సర్దుబాటులో కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఇబ్బందులున్నాయంటూ స్పష్టమైన సమాధానమివ్వకుండా దాటవేశారు. తెలంగాణలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు రూ.24,000 కోట్ల ఆర్థికసాయం అందించాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసును ఎందుకు బుట్టదాఖలు చేశారన్న ప్రశ్నకు కూడా ఆమె సమాధానమివ్వలేదు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద నిధుల కేటాయింపులో ఎలాంటి కోత విధించలేదని, రాష్ర్టాల డిమాండ్లను బట్టి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. 


కేంద్ర పన్నుల వాటాలో జనాభాకు ఎక్కువ వెయిటేజీ ఇవ్వడంవల్ల నష్టపోతున్న తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్ల రూపంలో రూ.726 కోట్లు ఇవ్వాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసును కేంద్రం ఎందుకు ఆమోదించలేదన్న ప్రశ్నపై నిర్మలాసీతారామన్‌ స్పందిస్తూ.. ఈ సిఫారసులో కొన్ని సాంకేతికపరమైన సందేహాలున్నందున మరోసారి పరిశీలించాలని కోరుతూ వెనక్కిపంపామని, అంతేతప్ప ఆ సిఫారసును తిరస్కరించలేదని చెప్పారు. ఆర్థికసంఘం ఏ పద్దు కింద ఆ ప్రత్యేక కేటాయింపు చేసిందో తెలిపిన వెంటనే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.2,000 కరెన్సీ నోట్లను నోట్లను రద్దుచేసే ప్రతిపాదన ఏదీ తన దృష్టికి రాలేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


తప్పనుకుంటే స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చు..

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించానని, కానీ రాష్ట్రం గురించి తప్పుగా మాట్లాడలేదని నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ఇచ్చామని చెప్పడమే తప్పని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నట్లు మీడియాలో చూశానని, ఇవ్వడం అనే పదం అభ్యంతరకరమైనదని తాను అనుకోవడంలేదని తెలిపారు. తాను ఏమైన అభ్యంతరకరంగా మాట్లాడి ఉంటే స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం కో-ఆపరేటివ్‌ ఫెడరలిజానికి కట్టుబడి ఉన్నదని, రాష్ర్టాల సహకారంతో దేశాభివృద్ధిని సాధిస్తామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ బెస్ట్‌ ఎకానమీ స్టేట్‌గా ఉన్నదని, అందుకే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెరిగిందని కేంద్ర ఆర్థిక, వ్యవసాయ శాఖల కార్యదర్శులు రాజీవ్‌ అతాను చక్రబర్తి, టీవీ సోమ్‌నాథ్‌ పేర్కొన్నారు.


ఏప్రిల్‌ నుంచి జీఎస్టీ రిటర్న్‌లు సులభతరం

దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము 2020-2021 వార్షిక బడ్జెట్‌ను రూపొందించామని, ఇందుకోసం కొన్నినెలలపాటు లోతైన కసరత్తు చేశామని నిర్మలాసీతారామన్‌ తెలిపారు. బడ్జెట్‌పై చర్చకు ముందు వాణిజ్య, వ్యాపారవర్గాలు, బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, ట్యాక్స్‌ ప్రాక్టీషనర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన పరస్పర చర్చాగోష్ఠిలో ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక పరమైన ఒత్తిడి ఉన్నప్పుడు ద్రవ్యలోటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కంటే 0.5 శాతం వరకు ఎక్కువగా ఉండవచ్చని, కేంద్ర ద్రవ్యలోటు ఆ మేరకే ఉన్నదని చెప్పారు. ఏప్రిల్‌ నుంచి జీఎస్టీ ఆన్‌లైన్‌ రిటర్న్‌లను మరింత సులభతరం చేయనున్నట్టు వెల్లడించారు. 


జీఎస్టీలో సులభమైన వ్యవస్థ మొదలవుతుందని పేర్కొంటూ.. దీనిపై ప్రజలకు అవగాహన కలిగించి ఎలాంటి సందేహాలు లేకుండా చూడాలని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు అధికారులతోపాటు కస్టమ్స్‌ అధికారులను ఆదేశించారు. ఆదాయం పన్ను శాఖలో దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బడ్జెట్‌లో దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చి వైద్యపరికరాల దిగుమతులపై పన్ను పెంచామన్నారు. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్‌ అతాను చక్రబర్తి, వ్యవసాయశాఖ కార్యదర్శి టీవీ సోమ్‌నాథ్‌, సీబీడిటీ చైర్మన్‌ పీవీ మోదీ, సీబీఐసీ చైర్మన్‌ అజిత్‌కుమార్‌ తదితరులు వివిధ అంశాలపై సందేహాలను నివృత్తిచేశారు.


సింగరేణి విజ్ఞప్తికి సానుకూల స్పందన

జీఎస్టీ నుంచి సింగరేణికి ఊరట కలిగించే విషయమై నిర్మలాసీతారామన్‌ సానుకూలంగా స్పందించారు. 2017 జూన్‌లో బొగ్గుస్టాక్‌ను బొగ్గు అమ్మకంగా భావించి కేంద్ర జీఎస్టీ విభాగం క్లీన్‌ ఎనర్జీ సెస్‌ కింద రూ.236 కోట్లు చెల్లించాలంటూ సింగరేణికి నోటీసు జారీచేసింది. దీన్ని ఉపసంహరించుకోవాలని సింగరేణి డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) ఎన్‌ బలరాం చేసిన విజ్ఞప్తిపై నిర్మలాసీతారామన్‌ స్పందిస్తూ.. నోటీసు పంపిస్తే పరిశీలించి తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇది వాస్తవరూపం దాల్చితే గత రెండేండ్లుగా సింగరేణిని ఇరకాటంలో పెడుతున్న డబుల్‌ ట్యాక్స్‌ చెల్లింపు వ్యవహారం కొలిక్కివస్తుంది.


logo