గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 00:47:58

సరిహద్దుల మూసివేత

సరిహద్దుల మూసివేత

  • మహారాష్ట్రవైపు రెండుమూడు రోజుల్లో నిర్ణయం
  • అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు   
  • 78 వైద్య బృందాలు: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దులను మూసివేయాలని ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మన పొరుగున దాదాపు ఐదారు వందల కిలోమీటర్ల మేర సరిహద్దు ఉన్న మహారాష్ట్రలో కరోనా బాధితులు ఎక్కువగా పెరుగుతున్నందున, అది మనకు చుట్టుకోకుండా చర్యలు తీసుకొంటామన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రెండుమూడు రోజుల తర్వాత సమీక్షించి మహారాష్ట్ర సరిహద్దులను మూసేయాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముందుగానే మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. 

‘ఆదిలాబాద్‌, నిజామాబాద్‌తోపాటు కొన్ని ఇతర ప్రాంతాలవారికి మహారాష్ట్రతో బంధుత్వాలు కూడా ఉన్నాయి. ధర్మాబాద్‌, యావత్మాల్‌, చంద్రాపూర్‌, బల్లార్షాతో మనకు దగ్గరి సంబంంధాలు ఉండటంతో సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరంగా జబ్బులను దిగుమతి చేసుకోబోం. రేపు కరోనా ఎలా ఉంటుందో చెప్పడం మన చేతుల్లో లేదు. కానీ స్వీయ నియంత్రణ పాటిస్తేనే మనకు శ్రీరామరక్ష. సెల్ఫ్‌ డిసిప్లిన్‌ మనలను కాపాడుతుంది. మనం ఇంట్లకెళ్లి బయటకు వెళ్లకుండా ఉంటే మనలను, కుటుంబాన్ని.. రాష్ర్టాన్ని, దేశాన్ని కాపాడుకొన్నట్టు’ అని సీఎం అన్నారు.  

52 చెక్‌పోస్టులు

మహారాష్ట్రతోపాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బయటి రాష్ర్టాల నుంచి వచ్చేవారికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అని ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా 78 సంయుక్త వైద్య బృందాలను నియమించామన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యం లో, సీఎంవో, సీఎస్‌ కార్యాలయం, డీజీపీ కార్యాలయం పర్యవేక్షణలో, సీనియర్‌ అధికారులతో ఐదుగురుసభ్యుల నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్జాతీయంగా, జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, మన రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న  పరిస్థితులు.. మనం తీసుకొంటున్న చర్యలు సరిగా ఉన్నాయా.. లేవా.. ఇంకేం చర్యలు తీసుకోవాలన్నది నిరంతరం పర్యవేక్షిస్తూ సీఎం కార్యాలయానికి, సీఎస్‌, డీజీపీ కార్యాలయాలకు నిపుణుల కమిటీ సమాచారమిస్తుందని పేర్కొన్నారు.


logo