సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:15:12

డిజిటల్‌ ఇండియాతో టీహబ్‌ జట్టు

డిజిటల్‌ ఇండియాతో టీహబ్‌ జట్టు

  • హార్డ్‌వేర్‌ అభివృద్ధికి, ఐవోటీ స్టార్టప్స్‌కు ఊతం
  • కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖతో భాగస్వామ్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో హార్డ్‌వేర్‌ అభివృద్ధికి, ఐవోటీ స్టార్టప్స్‌కు ఊతమిచ్చేందుకుగాను డిజిటల్‌ ఇండియాకు టీహబ్‌ నేతృత్వం వహించనున్నది. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచారసాంకేతికశాఖ (మెయిట్‌వై), డిజిటల్‌ ఇండియాతో భాగస్వామిగా చేరినట్టు టీహబ్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా హార్డ్‌వేర్‌ అభివృద్ధికి, ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) స్టార్టప్స్‌ కోసం కేంద్ర మంత్రిత్వశాఖ కలిసి పనిచేయనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐవోటీ స్టార్టప్స్‌, హార్డ్‌వేర్‌ అభివృద్ధిలో టీహబ్‌ డిజిటల్‌ ఇండియాకు నేతృత్వం వహించనున్నట్టు తెలిపింది. అంకుర సంస్థలకు అవకాశాలను మెరుగుపరచడం, వాటిని ఉత్పత్తి, పెట్టుబడుల రంగాల్లో సిద్ధంచేయడం, నూతన మార్కెట్‌ అవకాశాలు కల్పించడం ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నది. ఇందుకోసం 10 నుంచి 15 స్టార్టప్‌లను ఎంపికచేస్తామని తెలిపింది. మొబిలిటీ, ఇంధనం, వ్యవసాయం, ఎరోస్పేస్‌, మాన్యుఫాక్చరింగ్‌, వినిమయం, ఆరోగ్యం, వైద్యం, స్మార్ట్‌సిటీ, లాజిస్టిక్స్‌, సప్లయ్‌చైన్‌ వంటి రంగాల్లోని సంస్థలను ఎంపికచేస్తామని పేర్కొన్నది. స్టార్టప్‌ల దరఖాస్తు ప్రక్రియను ఈ నెలలోనే ప్రారంభిస్తామని, వచ్చిన వాటిలోనుంచి క్షుణ్ణంగా పరిశీలించి ఎంపికచేస్తామని వివరించింది. సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానంలో భారత్‌ ఇప్పటికే సత్తా చాటిందని, హార్డ్‌వేర్‌ రంగంలో ప్రధాన సమస్యలను పర్కిరించేదిశగా స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నామని టీహబ్‌ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన ఫేమ్‌-2, మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ ప్రణాళికలు బలమైన పునాదిని వేశాయని టీహబ్‌ సీఈవో రవినారాయణ్‌ పేర్కొన్నారు. భారత్‌లో హార్డ్‌వేర్‌ అభివృద్ధికి, ఐవోటీ స్టార్టప్‌లకు మరింత ఊతమివ్వనున్నామని, ఆ దిశలోనే కేంద్ర మంత్రిత్వశాఖలో భాగస్వామ్యమయ్యామని వివరించారు. logo