సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 02:20:37

సాంకేతికత..వడ్డీరేట్ల సరళీకరణ

సాంకేతికత..వడ్డీరేట్ల సరళీకరణ

అవి ఆర్థిక సంస్కరణలు కాదు.. దేశ పురోభివృద్ధికి పీవీ వేసిన బాటలు. కీలక, సంచలన నిర్ణయాలతో దేశ భవిష్యత్తును ఘనంగా మార్చేసిన ఘనత ఆయనది. పీవీ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణల్లో ద్రవ్య విధానం, బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రధానమైనవి. ఇక, వడ్డీరేట్ల సరళీకరణ ఆర్థిక సంస్కరణల్లో చెప్పుకోదగ్గది. 1991కు ముందు మెచ్యూరిటీ డిపాజిట్లపై వడ్డీ రేటును ఆర్బీఐ నియంత్రించేది. బ్యాంక్‌ లోన్లపైనా, వినియోగంపైనా ఆర్బీఐ ఆధిపత్యం ఉండేది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పీవీ ప్రభుత్వం వడ్డీరేట్ల సరళీకరణకు జైకొట్టింది. రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయటం, వినిమయరేటులో 22శాతం సర్దుబాటుతో పాటు దీర్ఘకాలిక డిపాజిట్లతో పాటు, స్వల్పకాలిక డిపాజిట్లపైనా నియంత్రణను ఎత్తేసింది. బ్యాంకులిచ్చే రుణాలు, స్వీకరించే డిపాజిట్లపై వడ్డీకి సంబంధించి అన్నిరకాల నియంత్రణ తొలగిపోయింది. మిగతా ఆర్థిక సంస్థలకు సంబంధించి డిబెంచర్లు, కంపెనీ డిపాజిట్లపై వడ్డీ విధానంపై ఉన్న అన్ని విధాలైన నియంత్రణలను కూడా ఎత్తేశారు. వడ్డీ రేట్లను మార్కెట్‌ శక్తులకు అనుగుణంగా నిర్ణయించుకొనే స్వేచ్ఛ బ్యాంకులకు లభించింది. ఈ సంస్కరణల ప్రక్రియల విధానంలోనే బ్యాంకుల ద్వారా సూక్ష్మ ఆర్థిక సంస్థలకు, సూక్ష్మ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సహాయక బృందాలకు, సభ్యులైన లబ్ధిదారులకు వర్తించే వడ్డీరేట్లను వారి విచక్షణకే వదిలేశారు. ఇది బ్యాంకింగ్‌ రంగంలో ప్రత్యేకత సంపాదించుకున్నది. బ్యాంక్‌ బ్రాంచుల లైసెన్సులకు సంబంధించిన విధానంలోనూ మార్పులు వచ్చాయి. బ్యాంకులు తమ బ్రాంచులను ఇష్టమొచ్చిన చోట్లలో పెట్టుకొనేందుకు, ప్రత్యేక బ్రాంచులను తెరిచేందుకు స్వేచ్ఛ కలిగింది. నరసింహం కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. కొత్త బ్యాంకు ఖాతాల నిబంధనలు కూడా సరళీకరించారు. ఆ సమయంలో వచ్చిన అందుబాటులోకి వచ్చిన సాంకేతికత బ్యాంకుల రూపురేఖలనే మార్చేసింది. బ్యాంకింగ్‌ రంగాన్ని కంప్యూటర్లతో అనుసంధానిస్తూ ఆన్‌లైన్‌ నగదు బదిలీలు, ప్లాస్టిక్‌ మనీ(క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు)ని ప్రవేశపెట్టారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వినియోగం తప్పనిసరిగా మారింది. ఆ ఘనతంతా పీవీ నరసింహారావు ప్రభుత్వానికే దక్కుతుంది.


logo