గురువారం 09 జూలై 2020
Telangana - Apr 10, 2020 , 02:12:43

కరోనాపై సాంకేతికాస్త్రం!

కరోనాపై సాంకేతికాస్త్రం!

  • ఏఐ, బిగ్‌డాటా, డ్రోన్లు, రోబోలను విస్తృతంగా వాడిన చైనా
  •  ‘ట్రేస్‌ టుగెదర్‌' యాప్‌ను రూపొందించిన సింగపూర్‌ 
  • ప్రత్యేక యాప్‌ రూపొందించే పనిలో తెలంగాణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారిని నిలువరించడంలో మానవాళికి టెక్నాలజీ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు చైనా విస్తృతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. కృత్రిమ మేధ మొదలుకుని బిగ్‌డాటా, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, కలర్‌ కోడింగ్‌, డ్రోన్లు, రోబోలు వరకు అన్ని సాంకేతిక వనరులను ఉపయోగించుకున్నది. మనదేశం కూడా సాంకేతికత వినియోగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నది. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కీలకపాత్ర పోషిస్తున్నది. వైద్య నిపుణులు వ్యాధుల గురించి లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నారు. కరోనా వైరస్‌లో సింగిల్‌ స్ట్రాండ్‌ ఆర్‌ఎన్‌ఏ వేగంగా పరివర్తనం చెందుతుంది. వ్యాక్సిన్‌ తయారీకి ఇది క్లిష్టతరంగా మారింది. వైరస్‌ నిర్మాణాన్ని వేగవంతంగా విశ్లేషించేందుకు చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం బైదు.. లీనియర్‌ఫోల్డ్‌ అల్గారిధమ్‌ను రూపొందించింది. మానవ శరీర ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులను గుర్తించేందుకు ఏఐ ఆధారిత ఇన్‌ఫ్రారెడ్‌ సిస్టమ్‌ను అభివృద్ధిచేసింది. 

డ్రోన్లు

చైనాలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య పరికరాలు, మందులు, రోగుల నమూనాలను తరలించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమాచారాన్ని నమోదుచేసేందుకు క్యూఆర్‌ కోడ్‌ కలిగిన డ్రోన్లను వాడుతున్నారు. క్రిమిసంహారక ద్రావణాలను పిచికారీ చేసేందుకు డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఇంటి నుంచి బయటకు వచ్చే వారిని, మాస్క్‌లు ధరించని వారిని గుర్తించేందుకు ఫేస్‌ రికగ్నిషన్‌ డ్రోన్లను వాడుతున్నారు. 

మనవద్ద కూడా..

సాంకేతిక పరిజ్ఞానంతో వైరస్‌ నియంత్రణపై ప్రజలకు కేరళ అవగాహన కల్పిస్తున్నది. ఐసొలేషన్‌ వార్డుల సమాచారాన్ని గోవా ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేస్తున్నది. తెలంగాణ సర్కార్‌ ఓ యాప్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.

డ్రైవర్‌ రహిత వాహనాలు

వ్యక్తులు నేరుగా కలువడం వల్ల వైరస్‌ సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది. కరోనా సంక్షోభంతో ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరతను ఎదుర్కొంటున్న చైనాకు డ్రైవర్‌ రహిత వాహనాలు ఉపశమనం కలిగించాయి. వీటి ద్వారా మందులు, ఆహార పదార్థాలు, ఇతర అత్యవసరాలను పంపిణీ చేస్తున్నారు. వీధులను శుభ్రపరిచేందుకు, దవాఖానల్లో పారిశుధ్య కార్యక్రమాలకు వీటిని వినియోగిస్తున్నారు. 

రోబోలు

రోగులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి, గదులు శుభ్రం చేయడానికి రోబోలను వినియోగిస్తున్నారు. అలాగే రోగ నిర్ధారణ, థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించడానికి వీటిని వాడుతున్నారు. వంటల్లోనూ ఈ రోబోలు సాయపడుతున్నాయి. కరోనా నిర్మూలనకు అభివృద్ధి చేసిన రోబోలు.. యూవీ కిరణాలను ప్రసరింపజేసి వైరస్‌ను నిర్మూలిస్తాయి. 

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ

కరోనా బాధితులు పెరుగడంతో వైద్య సిబ్బందితోపాటు, దవాఖాన పరిపాలన సిబ్బందిపైనా పనిభారం పెరిగింది. దీన్ని తగ్గించేందుకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రోగులకు సంబంధించిన దవాఖాన బిల్లులు, ఆరోగ్య బీమా పాలసీల ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో ఉపయోగపడుతున్నది. దీని ద్వారా దవాఖాన సిబ్బంది, బాధితుల మధ్య ముఖాముఖి చాలా వరకు తగ్గిపోయింది.

కలర్‌ కోడింగ్‌

 కోట్లాది మందిని ట్రాక్‌ చేసేందుకు అలీబాబా, టెన్సెంట్‌ వంటి కంపెనీలతో కలిసి చైనా ‘కలర్‌ కోడెడ్‌ హెల్త్‌ రేటింగ్‌ సిస్టమ్‌'ను ప్రవేశపెట్టింది. వ్యక్తుల ప్రయాణ, వైద్య చరిత్రను బట్టి ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగు కోడ్‌లను కేటాయిస్తారు. దీని ఆధారంగానే ఓ వ్యక్తిని క్వారంటైన్‌లో ఉంచాలా లేక బయటకు అనుమతించవచ్చా అన్నది నిర్ధారిస్థారు. 

‘ట్రేస్‌ టుగెదర్‌' పట్టేస్తుంది..

కరోనా కట్టడికి సింగపూర్‌  ‘ట్రేస్‌ టుగెదర్‌' యాప్‌ను రూపొందించింది. కరోనా బాధితుల వివరాలను నిక్షిప్తం చేసింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికి.. రెండు మీటర్ల దూరంలో కరోనా బాధితుడు ఉన్నా తక్షణమే వారి ఫోనుకు నోటిఫికేషన్‌ వస్తుంది. దీంతో వారు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. 

బిగ్‌డాటా

చైనాలో బిగ్‌డాటా ఆధారంగా డ్యాష్‌బోర్డులను రూపొందించారు. ఫేస్‌ రికగ్నిషన్‌, ఇన్‌ఫ్రారెడ్‌ టెంపరేచర్‌ డిటెక్షన్‌ వ్యవస్థలను ప్రధాన నగరాల్లో ఏర్పాటుచేశారు. వీటి ద్వారా ప్రజల కదలికలను గుర్తించవచ్చు. క్వారంటైన్‌లో ఉన్నవ్యక్తులు బయటకు రాకుండా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. వైరస్‌ బారిన పడినవారి వివరాలను ఫోన్లకు సందేశాల ద్వారా పంపి ప్రజలను అప్రమత్తం చేశారు. 


logo