మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 21:56:28

సింగరేణి ‘పరీక్ష’ కేసులో11 మంది అరెస్టు

సింగరేణి ‘పరీక్ష’ కేసులో11 మంది అరెస్టు

కొత్తగూడెం  : సింగరేణి ఈఅండ్‌ఎం రాత పరీక్షలో జరిగిన సాంకేతిక మాల్‌ప్రాక్టీస్‌పై ఎట్టకేలకు పోలీసు అధికారులు క్లారిటీ ఇచ్చారు. శనివారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ శబరీశ్‌ మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఎలక్ట్రీషియన్‌ అండ్‌ మెకానికల్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ 68 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 1వ తేదీన పరీక్షా కేంద్రాల్లో ఈఅండ్‌ఎం పరీక్ష జరిగింది. కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో నిర్వహించిన ఈ రాత పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వ్యక్తులతో పాటు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. 


హర్యానాకు చెందిన రాకేష్‌సింగ్‌, రాకేష్‌కుమార్‌, మంజిత్‌, దీపక్‌ మోర్‌, రాందాస్‌, సందీప్‌, వికాస్‌మోర్‌, బిహార్‌ రాష్ట్రానికి చెందిన పురుషోత్తం, కుమార్‌ విశాల్‌ పట్టుబడిన వారిలో ఉన్నారు. కొత్తగూడానికి చెందిన సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ కోల హరీష్‌, జనరల్‌ మజ్దూర్‌ లక్ష్మీనారాయణ మాల్‌ప్రాక్టీస్‌ చేసే యువకులకు సహకరించినట్లుగా సహకరించారు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఆరుగురు సూత్రధారులతో పాటు నకిలీ వ్యక్తులు ఐదుగురు కలిపి మొత్తం 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన కొంత మంది వ్యక్తులు ఇంకా పరారీలోనే ఉన్నారని, దర్యాప్తు సజావుగా సాగాలనే ఉద్దేశంతో వారి వివరాలను వెల్లడించడం లేదని తెలిపారు. 


అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు తీసుకోవడానికి సిద్ధపడ్డారని తెలిపారు. రాతపరీక్షకు హాజరయ్యే వ్యక్తులను ఎంపిక చేయడం దగ్గర నుంచి వారిని ఒప్పించడం లాంటి విషయాల్లో లక్ష్మీనారాయణ, హరీష్‌ బాధ్యత తీసుకోగా నకిలీ అభ్యర్థులతో పరీక్ష రాయించే బాధ్యతను పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు తీసుకొని హర్యానా, బిహార్‌ రాష్ర్టాలకు చెందిన సదరు 12 మందితో పరీక్షలు రాయించారు. పరీక్ష రాయడానికి వచ్చిన నకిలీ అభ్యర్థుల్లో కొంత మంది సెల్‌ఫోన్‌లు, మైక్రోచిప్‌ బ్లూటూత్‌ డివైజ్‌లను, మైక్రోఫోన్‌లను వాడినట్లుగా ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. 


నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని సమగ్ర దర్యాప్తు జరిపి ఇతర అనుమానితుల ప్రమేయంపైన కూడా పూర్తి విచారణ నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం అరస్టైన వారి నుంచి రూ.11 లక్షల నగదు, 17 సెల్‌ఫోన్‌లు, 11 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంట కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం ఆలీ, చుంచుపల్లి సీఐ అశోక్‌కుమార్‌, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ లావుడ్యా రాజు, పాల్వంచ సీఐ నవీన్‌ ఉన్నారు.logo
>>>>>>