టమాట రైతుకు టెకీల అండ

- హైదరాబాద్‌లో ప్రత్యేక విక్రయ కేంద్రాలు
- పొలంనుంచే నేరుగా వినియోదారులకు సరఫరా
- దళారులు పొందే లాభాలు రైతుల ఖాతాల్లోకి
- ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ చొరవ
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రైతు పడే కష్టం మాటల్లో చెప్పలేనిది. ఎండనక వాననక కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం మరింత కష్టమైన పని. ముఖ్యంగా ఉద్యాన, కూరగాయల పంటలు పండించే రైతుల పంటను దళారుల చేతుల్లో పడకుండా.. ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ దన్నుగా నిలుస్తున్నది. 120 మంది ఐటీ ఉద్యోగులతో ఏర్పడిన ఈ ఫోరం కూరగాయల రైతుల నుంచి ముఖ్యంగా టమాట రైతుల నుంచి పంటను సేకరించి హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విక్రయకేంద్రాలకు తరలిస్తున్నది. ఐటీ ఉద్యోగులు తాము ఖాళీగా ఉండే శని ఆదివారాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులతో కలిసి పనిచేస్తూ వారికి లాభం వచ్చేలా మార్కెటింగ్ నైపుణ్యాలను అమలుచేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసించే అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల్లో విక్రయకేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల పంటను అక్కడకు తరలిస్తున్నారు. దీనిద్వారా పొందే లబ్ధి మొత్తం రైతులకే అందేలా చూస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు బత్తాయి, తర్వాత నిమ్మ రైతులకు ఈ ఫోరం అండగా నిలిచింది. తాజాగా టమాట రైతుకు మంచి ధర లభించేలా చూస్తున్నది.
మేం ఊహించలేదు
కిలో టమాట రూ.2కే అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ముందుకొచ్చింది. నగరంలో కిలో రూ. 15 చొప్పున విక్రయించి వచ్చిన డబ్బు మొత్తం మాకే చెల్లిస్తున్నారు. దీనిని మేం ఊహించలేదు. చాలా ఆనందంగా ఉన్నది. ఐటీ ఉద్యోగుల మనసు చాలా గొప్పది.
- నాగమణి, టమాట రైతు, నల్లగొండ
సాగులో సాంకేతికత పెంచే యత్నం
ఐటీ పరంగా ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నాం. సాగు లోనూ సాంకేతిక పరిజ్ఞానా న్ని వాడిన రైతుకు లాభం చేకూర్చాలన్న ఆలోచనతో వారితో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. పంటలకు మంచి ధర ఇప్పించేందుకు వాహనాల ద్వారా పొలాల నుంచే పంటను తీసుకొస్తున్నాం. నగరంలో విక్రయించగా వచ్చిన సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేస్తున్నాం. రైతులు ఇక్కడకు రాకున్నా మార్కెటింగ్ మొత్తం మేమే చూసుకొంటున్నాం.
- కిరణ్‌చంద్ర, అధ్యక్షుడు, ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్
ఐటీ ఉద్యోగుల కృషి ఎంతో గొప్పది
రైతుల పంటకు మార్కెట్లో ధర వచ్చేలా ఐటీ ఉద్యోగులు చేస్తున్న కృషి ఎంతో గొప్పది. దీనిని ఇతరులు సైతం స్ఫూర్తిగా తీసుకోవాలి. హైదరాబాద్‌లో లక్షలమంది వినియోగదారులు ఉన్నారు. వారికి నేరుగా విక్రయిస్తే రైతుకు లాభం చేకూరుతుంది.
- జయంతి, వినియోగదారు
రైతులకు ఎంతో మేలు
ఐటీ ఉద్యోగులు చేస్తున్న కృషివల్ల రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతున్నది. గిట్టుబాటు ధరకు చెల్లించి మేం కూడా అన్నదాతకు మేలు చేసినట్టుగానే భావిస్తున్నాం.
- రవి, వినియోగదారుడు
తాజావార్తలు
- జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్‌కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్‌కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు