గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 20, 2020 , 01:20:21

పీఆర్సీ త్వరలోనే వస్తుంది

పీఆర్సీ త్వరలోనే వస్తుంది
  • ఈ మేరకు సీఎస్‌ హామీ ఇచ్చారు
  • ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: త్వరలోనే పీఆర్సీ వస్తుందని, కమిషన్‌ గడువు పెంపునకు పీఆర్సీ ప్రకటనకు సంబంధం లేదని, దీనిపై ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ వీ మమత స్పష్టంచేశారు. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉన్నదని, నెలరోజుల్లో కమిషన్‌ నివేదిక అందిస్తారని చెప్పారు. వేతన సవరణ కమిషన్‌ గడువు పెంపు నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బుధవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. 


అనంతరం పలు ఉద్యోగ సంఘాలతో కలిసి జేఏసీ అధ్యక్షుడు, సెక్రటరీ జనరల్‌ మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ అనేది వేతన సవరణ కోసమే ఏర్పాటు చేయలేదని, ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాలపై అధ్యయనానికి ఈ కమిటీ ఏర్పాటుచేశారన్నారు. పీఆర్సీ గడువు పెంచుతూ జీవో రావ డంతో ఉద్యోగులు కొంత ఆందోళన చెందారని, ఈ ఏడాది కూడా వేతనాలు పెంచరనే అనుమానంతో ఉన్నారని, అందుకే సీఎస్‌ను కలిసి వివరించాల్సి వచ్చిందని తెలిపారు. సీఎస్‌ కూడా గడువు పెంపుపై ఆందోళన వద్దని స్పష్టంగా చెప్పారన్నారు. మార్చిలో పీఆర్సీ వస్తుందని, త్వరలోనే ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడుతామని సీఎస్‌ చెప్పారని వివరించారు.  


సీఎస్‌ను కలిసినవారిలో జేఏసీ సెక్రటరీలు మామిళ్ల రాజేందర్‌, ఏనుగుల సత్యనారాయణ, పలు సంఘాల ప్రతినిధులు రేచల్‌, వెంకటేశ్వర్లు, ఉమ, కొండల్‌రెడ్డి, లక్ష్మణ్‌, పతాప్‌, శ్రీకాంత్‌, ఎంబీ కృష్ణయాదవ్‌, గం డూరి వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, టీటీయూ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, జేఎల్‌ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, విశ్వవిద్యాలయాల ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మధుకర్‌ పాల్గొన్నారు.


logo