శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 02:09:01

టీచర్‌ పోస్టుల ఖాళీలు8,000

టీచర్‌ పోస్టుల ఖాళీలు8,000

  • ప్రభుత్వానికి వివిధ శాఖల నుంచి వివరాలు!
  • వీఆర్వోల సర్దుబాటు తర్వాత ఖాళీలపై స్పష్టత
  • త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదన
  • వైద్య, విద్య, పోలీస్‌శాఖలకు తొలి ప్రాధాన్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో ప్రాథమిక అంకం పూర్తయినట్టు తెలుస్తున్నది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలు, కొన్నింటిలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు జిల్లాలవారీగా ప్రభుత్వానికి చేరాయి. ఆయా శాఖల అధికారులు యుద్ధప్రాతిపదికన ఆదివారం కూడా పనిచేసి పూర్తి వివరాలను సోమవారం ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖలో టీచర్‌ పోస్టుల ఖాళీలు 8,000 ఉన్నాయని పేర్కొంటూ ఆ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలిసింది. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, భాషా పండితులు, పీఈటీలతోపాటు మోడల్‌ స్కూల్‌లో ఖాళీగా ఉన్న టీజీటీ, పీజీటీ పోస్టుల వివరాలు కూడా ఉన్నట్టు సమాచారం. అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ అధికారులు, డైట్‌ కాలేజీ లెక్చరర్లు, గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్ల పోస్టుల వివరాలను కూడా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రిజర్వేషన్ల వారీగా, రోస్టర్‌ పాయింట్లతో సహా ప్రభుత్వానికి ఖాళీల వివరాలను పంపినట్లు తెలిసింది. 

త్వరలో సీఎంకు నివేదిక

జిల్లాల నుంచి వచ్చిన వివరాలను ఆ యా శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందించారు. ఆ వివరాలను క్రోడీకరించి, ఖాళీల జాబితా, ఆ యా స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జాబితాను అతి త్వరలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు నివేదించనున్నారు. ఆ నివేదికను సీఎం పరిశీలించిన తరువాత ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. భారీ స్థాయిలో వైద్య, విద్య, పోలీస్‌ శాఖల్లో నియామకాలు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వీటితో పాటుమిగిలిన శాఖల్లో ఉన్న ఖాళీలను కూడా వాటి అవసరాల మేరకు నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా వీఆర్వోలను వివిధ శాఖలలో సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీఆర్వోలను సర్దుబాటు చేసిన తరువాత మిగిలిన ఖాళీలపై స్పష్టత వస్తుంది. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ఏర్పడిన అన్ని గ్రామాలకు సర్కారు భారీ ఎత్తున జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. వారిని కూడా పర్మినెంట్‌ చేయాల్సిన అవసరం ఉన్నది. దీనిపై కూడా అధికారులు దృష్టి సారించనున్నారు. 

ఉద్యోగాల భర్తీ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రభుత్వ పశు వైద్యుల సంఘం

తెలంగాణలో చేపట్టిన ఉద్యోగాల భర్తీలో శాఖాపరమైన నియామకాలకు పెద్దపీట వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ పశు వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ దేవేందర్‌ తెలిపారు. ఈ మేరకు సంఘ సభ్యులు సోమవారం పశు సంవర్ధకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు విష్ణువర్ధన్‌గౌడ్‌, నాగరాజ్‌ యాదవ్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే వెటర్నరీ డాక్టర్‌ పోస్టులను శాఖాపరంగా భర్తీచేయాలని తెలంగాణ వెటర్నరీ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కాటం శ్రీధర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. logo