శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:32:39

భర్త కోసం ఉపాధ్యాయురాలి ఆందోళన

భర్త కోసం ఉపాధ్యాయురాలి ఆందోళన

  • రెండ్రోజులుగా అత్తింటి ఎదుట పిల్లలతో దీక్ష

నల్లగొండ క్రైం: తన భర్తను తనకు అప్పగించాలని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అత్తింటి ఎదుట దీక్షకు దిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి రెండ్రోజులుగా దీక్ష చేస్తున్నా వారు తలుపులు తీయట్లేదని వాపోతున్నది. నల్లగొండ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన దుస్సా హేమలత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమెకు నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీకి చెందిన రాపోలు ప్రకాశ్‌తో 2003లో పెండ్లి అయ్యింది. వివాహ సమయంలో ఆమె పేరు శ్రీలతగా మార్చుకున్నది. ఐదేండ్లపాటు కాపురం సజావుగానే సాగగా ఒక అమ్మాయి, అబ్బాయి జన్మించారు. ఈ క్రమంలో ప్రకాశ్‌ మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ ఇంటికి రాకపోయేవాడు. అడిగితే శ్రీలతను కొట్టేవాడు. ఈ క్రమంలో 2018లో పోలీస్‌స్టేషన్‌లో శ్రీలత కేసు పెట్టగా పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. కొంతకాలం బాగానే ఉన్నారు. ఈ క్రమంలో శ్రీలత గర్భవతి కాగా.. అమ్మాయి పుడితే సూర్యాపేటలోని తన మిత్రుడికి దత్తత ఇవ్వాలని బలవంతపెట్టాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడిచేశాడు. అందుకూ అంగీకరించకపోవడంతో కొట్టి ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ప్రకాశ్‌ తన తల్లివద్దే ఉంటూ వేరే మహిళతో సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు. రెండ్రోజులుగా పిల్లలతో దీక్ష చేస్తున్నానని.. తన భర్తను అప్పగించాలని వేడుకుంటున్నది. 


logo