శనివారం 11 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:41:30

ఏపీలో ఐఎంఎస్‌ స్కాంలో అచ్చెన్న అరెస్టు

ఏపీలో ఐఎంఎస్‌ స్కాంలో  అచ్చెన్న అరెస్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కాంలో అరెస్టుల పర్వం మొదలైంది. దాదా పు రూ.150 కోట్ల మేర అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఏపీ ఏసీబీ.. మాజీ కార్మికమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును శుక్రవారం అరెస్టుచేసిం ది. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఏపీ ఐఎంఎస్‌ డైరెక్టర్‌ సీకే రమేశ్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకొన్నారు. తెలంగాణ ఐఎంఎస్‌లో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఏపీలోనూ ప్రభు త్వం అప్రత్తమయింది.  అక్కడ భారీగానే అవినీతి జరిగినట్టు విజిలెన్స్‌ అధికారుల నివేదికతో ఏసీబీని రంగంలోకి దింపింది. అవినీతి నిరోధకచట్టం 1988లోని సెక్షన్‌ 13(1),13 (2) సెక్షన్ల కింద కేసులు నమోదుచేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తులో భాగంగా శుక్రవారం పలువురిని అరెస్టు చేశారు. ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడును శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అరెస్టు చేసినట్టు ఏపీ ఏసీబీ జేడీ రవికుమార్‌ మీడియాకు తెలిపారు.

మాజీ డైరెక్టర్‌ రమేశ్‌కుమార్‌ను తిరుపతిలో, డాక్టర్‌ విజయ్‌కుమార్‌, డాక్టర్‌ జనార్దన్‌, ఈ రమేశ్‌బాబు, ఎంబీకే చక్రవర్తిలను రాజమహేంద్రవరంలో అరెస్టుచేసినట్టు తెలిపారు. ఆరుగురిని విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని వివరించారు. గత ఐదేండ్లలో ప్రభుత్వం రూ.988 కోట్లు కేటాయిస్తే.. అందులో రూ.150 కోట్ల మేర అవినీతి జరిగిందని గుర్తించినట్టు తెలిపారు. మందులు, ల్యాబ్‌ కిట్లు, ఫర్నిచర్‌ను మార్కెట్‌ ధర కంటే 50 నుంచి 130శాతం అధికధరకు కొనుగోలు చేసినట్టు ఏసీబీ ర్యాండమ్‌గా చేసిన పరిశీలనలో వెల్లడయిందన్నారు. ఏపీలోని ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినందుకే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

అచ్చెన్నాయుడును కిడ్నాప్‌చేశారు: చంద్రబాబు 

అచ్చెన్నాయుడును ఏపీ పోలీసులు కిడ్నా ప్‌ చేశారని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. కనీసం మందులు కూడా వేసుకోనివ్వలేదని, వారి కుటుంబసభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా అందుబాటులో లేకుండా చేశారని తెలిపారు. జగన్‌ ఉన్మా దం, పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అమరావతిలో లేఖ విడుదల చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టు సందేహాలకు తావిస్తున్నదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.


logo