ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 01:10:18

సింగరేణిలో జంగ్‌సైరన్‌

సింగరేణిలో జంగ్‌సైరన్‌

  • బొగ్గుబావుల ప్రైవేటీకరణపై టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు
  • కేంద్రసర్కార్‌ దిష్టిబొమ్మల దహనం.. జూలై 2న 24 గంటల సమ్మె

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ /నెట్‌వర్క్‌: సింగరేణిలో జంగ్‌ సైరన్‌ మోగింది. బొగ్గుబావులను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళనలు నిర్వహించారు. నిజామాబాద్‌ మాజీ ఎంపీ, టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపుమేరకు సింగరేణి వ్యాప్తంగా 72 చోట్ల కార్మికులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. 

భూగర్భగనులు, ఓపెన్‌ కాస్టుల వద్ద 44, వివిధశాఖల కార్యాలయాల వద్ద 28 చోట్ల దిష్టిబొమ్మలను దహనం చేసినట్టు టీబీజీకేఎస్‌ నాయకులు తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా వచ్చే నెల 2వ తేదీన 24 గంటల సమ్మె చేయాలని టీబీజీకేఎస్‌ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరిధిలోని జీడీకే 11 ఇంక్లయిన్‌లో జరిగిన ఆందోళనలో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌ మాట్లాడుతూ.. ఒక వైపు కరోనాతో దేశమంతా అతలాకుతలం అవుతుంటే సందట్లో సడేమియా అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గుబ్లాకులను ప్రైవేటీకరించేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 41 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విదేశీ పెట్టుబడులకు వంద శాతం అనుమతులు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 

 మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని ఆర్‌కే 1ఏ గనిపై నిర్వహించిన ఆందోళనలో టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిస్తే ప్రభుత్వరంగ సంస్థలైన కోల్‌ ఇండియా, సింగరేణికి తీవ్రనష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు కంపెనీలకు బొగ్గు గనులు అప్పగిస్తే కార్మికుల సంక్షేమం, కార్మిక చట్టాలు గాలిలో కలిసిపోతాయన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనలు జరిగినట్టు తెలిపారు. ఆర్థికమాంద్యం పేరుతో బ్లాకులను వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకోవటం దారుణమన్నారు. దీనివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. జీతాలు, జీవితాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం 


శాంతిఖని, ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో, అబ్బాపూర్‌ ఓపెన్‌ కాస్టుపై, కాసిపేట గని వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మందమర్రి ఏరియాలో అన్ని శాఖల్లో ఆందోళనలు నిర్వహించారు. శ్రీరాంపూర్‌ ఏరియాలో ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, కేంద్ర చర్చల కమిటీ ప్రతినిధులు ఏనుగు రవీందర్‌రెడ్డి, వీరభద్రయ్య తదితరుల ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లోనూ బొగ్గుగని కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. వీకే7 షాప్ట్‌ ప్రధానగేటు ఎదుట కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలని  కొత్తగూడెంలో ఏరియా ఉపాధ్యక్షుడు రజాక్‌ డిమాండ్‌ చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో అన్ని బొగ్గుగనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద టీబీజీకేఎస్‌ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో కార్మికులు కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీబీజీకేఎస్‌కు మద్దతుగా పలుచోట్ల టీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


logo