మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 02:29:51

తాసిల్దార్‌ కాళ్లు మొక్కిన రైతులు

తాసిల్దార్‌ కాళ్లు మొక్కిన రైతులు

చింతలమానేపల్లి: ‘మీ కాళ్లు పట్టుకుంటం.. జెర మాకు న్యాయం చేయండి’ అంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి తాసిల్దార్‌ నియాజొద్దీన్‌ను  బాబాసాగర్‌ గ్రామానికి  చెందిన ఓ రైతు కుటుంబం వేడుకున్నది. బాధితులు దందెర అంకులు, దందెర రమేశ్‌, దందెర మల్లేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాబాసాగర్‌ శివారులో తమ తాత దందెర గంగారాం పేరిట సర్వే నంబరు 85/ఎలో 11.26 ఎకరాల భూమి ఉన్నది.  భూమిని అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగపట్టా చేసుకున్నారు. తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని, అక్కడికి వెళ్తే అక్రమంగా పట్టా చేయించుకొన్న వారు తమపై కర్రలతో దాడి చేస్తున్నారని వాపోయారు. ఆ భూమి మీద ఆధారపడే తమ కుటుంబాలు బతుకుతున్నాయని తెలిపారు. గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం భార్యాపిల్లలతో కలిసి బాధితులు తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.  తాసిల్దార్‌ నియాజొద్దీన్‌ హామీతో ఆందోళన విరమించారు.  logo