మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 02:11:37

ముక్తసరి జవాబులే..

ముక్తసరి జవాబులే..

  • ఏసీబీ ప్రశ్నలకు సరైన సమాధానమివ్వని తాసిల్దార్‌ నాగరాజు
  • లాకర్‌పైనా తప్పుదోవ పట్టించేందుకు యత్నం
  • నాగరాజు పేరిట రూ.10 కోట్ల మేర అక్రమాస్తులు!
  • డబ్బులు తానే తెచ్చినట్టు అంగీకరించిన శ్రీనాథ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారీ లంచావతారుడు కీసర తాసిల్దార్‌ నాగరాజు మూడు రోజుల కస్టడీలో ఏసీబీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఏ విషయంపై అడిగినా ముక్తసరి సమాధానాలతోనే సరిపెట్టినట్టు తెలిసింది. ఓ వివాదాస్పద భూమి విషయంలో సెటిల్‌మెంట్‌ కోసం రూ.కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ తాసిల్దార్‌ నాగరాజు, అతడికి సహకరించిన వీఆర్‌ఏ సాయిరాజ్‌, లంచం ఇచ్చిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌లను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. వీరినుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మంగళవారం నుంచి మూడు రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు పలు కీలక విషయాలపై ఆరా తీశారు. గురువారంతో వీరి కస్టడీ ముగిసింది. వీరందరినీ వేర్వేరుగా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. నాగరాజు ఆస్తులపై ఏసీబీ అడిగిన ప్రశ్నలకు తాసిల్దార్‌ సరైన సమాధాలు చెప్పకపోగా, దాటవేసే ప్రయత్నంచేసినట్టు సమాచారం. పట్టుబడిన పత్రాలు, సేకరించిన ఇతర విషయాల ఆధారంగా నాగరాజు, అతడి బంధువుల పేరిట కలిపి మొత్తం రూ.10 కోట్ల వరకు ఆస్తులున్నట్టు ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన నాగరాజు బ్యాంక్‌ లాకర్‌ విషయంపై మాత్రం ఏసీబీ అధికారులు స్పష్టతకు రాలేకపోయారు. మూడు రోజులపాటు ప్రశ్నించినా, నాగరాజు గుర్తులేదు.. తెలియదు.. అంటూ తప్పుడు సమాధానాలతోనే కాలం వెల్లబుచ్చినట్టు సమాచారం. ఇంతకీ ఆ లాకర్‌ ఉన్న బ్యాంక్‌ ఏది అన్నది ఇంకా మిస్టరీగానే ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఈ కేసులో మరో కీలక నిందితుడు సీహెచ్‌ శ్రీనాథ్‌యాదవ్‌ నుంచి కీలక విషయాలు ఏసీబీ రాబట్టింది. రూ.కోటీ 10 లక్షల లంచంలో దాదాపు రూ.90 లక్షలకుపైగా సొమ్మును తానే సర్దుబాటుచేశానని అంగీకరించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని వరంగల్‌ నుంచి తెచ్చినట్టు శ్రీనాథ్‌యాదవ్‌ చెప్పినట్టు సమాచారం. తాను సైతం ఈ సెటిల్‌మెంట్‌లో తాసిల్దార్‌ నాగరాజుతో కలిసి డీల్‌చేసినట్టు అంజిరెడ్డి సైతం అంగీకరించినట్టు తెలిసింది. పూర్తి సమాచారం రానందున మరోమారు నలుగురిని కస్టడీకి తీసుకోవాలనే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు సమాచారం.


logo