మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:43:08

కంకర పోస్తామని.. కాసులు కాజేస్తుండ్రు

కంకర పోస్తామని.. కాసులు కాజేస్తుండ్రు

  • బిల్డింగ్‌ మెటీరియల్‌ సైప్లె పేరిట నయా దోపిడీ
  • నూతన గృహనిర్మాణదారులే టార్గెట్‌ 

కమాన్‌పూర్‌: జనవరి 6: మీకు ఇసుక, కంకర కావాలట కదా.. మీ మేస్త్రీ చెప్పిండు, బయటికన్నా తక్కువ ధరకే మేం పోస్తం అని చెబుతారు.. ఊరి బయట మా ట్రాక్టర్‌ లోడ్‌తో ఆగిపోయింది, మాకు వెంటనే డబ్బులు ఇస్తే రూ.500కే లోడ్‌ పోస్తామని నమ్మిస్తారు.. తక్కువ ధరకే కంకర వస్తుంది కదా అని యజమానులు వారి చేతుల్లో డబ్బులు పెట్టగానే.. ట్రాక్టర్‌ వెళ్లేందుకు తొవ్వ చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి జారుకొంటారు. బిల్డింగ్‌ మెటీరియల్‌ పేరిట గృహనిర్మాణదారులే లక్ష్యంగా అందికాడికి దోచుకొంటున్న ఓ ముఠా దందా పెద్దపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కమాన్‌పూర్‌ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన ఏర్ని మధు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ నెల 5న మధ్యాహ్నం సమయంలో నంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌ మీద ఇద్ద రు వ్యక్తులు ముఖాలకు టవల్‌ కట్టుకుని మధు ఇంటికి వచ్చారు. అక్కడ ఉన్న మధు చెల్లెలితో ‘మీ ఇంటి నిర్మాణానికి కంకర కావాలని మేస్త్రీ చెప్పిండు.. వస్తుంటే మా ట్రాక్టర్‌లో డీజీల్‌ అయిపోయి ఊరు పక్కనే లోడ్‌తో ఆగిపోయింది.. డీజిల్‌కు డబ్బులు లేవు, మీరిస్తే లోడ్‌ రూ.500కే పోస్తం’ అని చెప్పారు. దీంతో ఆమె అన్నయ్యకు ఫోన్‌ చేసి మాట్లాడండి అని చెప్పింది. దీంతో వారిలో ఒకరు ‘నా సెల్‌ పాడైంది’ అని, మరొకరు ‘నా ఫోన్‌లో బ్యాలెన్స్‌ అయిపోయింది’ అని దాటవేశారు. ఆమెకు నమ్మకం కలిగేలా వ్యవహరించి రూ.3 వేలు తీసుకుని ఉడాయించారు. తర్వాత కంకర కోసం వేచి చూసిన బాధితులు తాము మోసపోయిన తెలుసుకొని విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ ధరకు మెటీరియల్‌ సఫ్లై చేస్తామంటూ వచ్చే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 


logo