శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 15:46:52

ప్ర‌తి ఇంటికీ తాగునీరు అందిస్తాం : మ‌ంత్రి అల్లోల

ప్ర‌తి ఇంటికీ తాగునీరు అందిస్తాం : మ‌ంత్రి అల్లోల

నిర్మ‌ల్ : మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలో బంగల్ పెట్ విసురాళ్ళ గుట్ట వద్ద నూతనంగా నిర్మించనున్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంఖుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గంలో రూ.42 కోట్ల నిధులతో మిషన్ భగీరథ పథకంలో 5 వాటర్ ట్యాంక్ లను నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్తులో పట్టణ ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. విసురాల గుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ద్వారా 42 వార్డులకు నీటిని సరఫరా చేస్తామన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇప్పటికే గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు పంపిణీ అవుతున్నాయని త్వరలోనే పట్టణంలోనూ ఈ సదుపాయం కలిపిస్తామన్నారు. ఒక రూపాయికె నల్లా కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందనున్నాయని తెలిపారు. 

పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద సమీకృత మార్కెట్ ను నిర్మిస్తున్నామని, రూ. 50 లక్షల నిధులతో ఫిష్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి వార్డులో ప్రజా దర్బార్ నిర్వహించి డిసెంబర్ నాటికి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రకటిస్తామన్నారు. పారదర్శకంగా ఇండ్ల ఎంపిక జరుగుతుందని ఇందులో ఎవరి ప్రమేయం ఉండదన్నారు. నిర్మల్ పట్టణాన్ని రాబోయే రోజుల్లో సర్వాంగసుందరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతకు ముందు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా సోమవార్ పెట్, నాయుడు వాడ వద్ద డ్రైనేజీ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు రాంకిషన్ రెడ్డి,  మరుగొండ రాము, పట్టణ  కౌన్సిలర్లు, నాయకులు, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo