శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 01:08:17

ఈ పిడుగులు..ఆంగ్లంతో ఆటాడేస్తారు!

ఈ పిడుగులు..ఆంగ్లంతో ఆటాడేస్తారు!

  • భాషను అవపోసన పట్టిన ప్రభుత్వ విద్యార్థులు
  • విదేశీయులతో ‘స్కైప్‌' ముచ్చట్లతో అభ్యసనం
  • మలక్‌పేట  ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

ఇంగ్లిష్‌ అంటేనే చాలామంది సగం సచ్చిపోతారు.. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఈ భయం మరీ ఎక్కువ. ‘నాలుగు ఇంగ్లిష్‌ ముక్కలు అనర్గళంగా మాట్లాడితే’.. అబ్బా మస్తు మాట్లాడుతుండు పో అని లోలోపలే గొణుక్కుంటారు.. కానీ, హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్‌ హైస్కూల్‌ విద్యార్థులు ఇందుకు పూర్తి భిన్నం. వీళ్లు ఇంగ్లిష్‌తో ఆటాడేస్తారు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్‌, ఫిలిప్పీన్స్‌, గ్రీస్‌, జాంబియా తదితర దేశస్తులతో అనర్గళంగా మాట్లాడేస్తారు. ‘ఇంగ్లిష్‌లో మాట్లాడటమంటేనే ఇష్టం’ అని బెరుకులేకుండా చెప్పేస్తున్నారు..

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ఇంగ్లిష్‌ రావాలంటే ఏం చేయాలి? ఆంగ్లంపై భయం పోవాలంటే ఎలా ముందుకెళ్లాలి? అనర్గళంగా ఎలా మాట్లాడాలి? భాషా నైపుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి? అని మెదడును తొలిచేస్తున్న ప్రశ్నలకు హైదరాబాద్‌ మలక్‌పేటలోని ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమాధానం కనుగొన్నారు. 

‘అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు..

తినగతినగ వేము తియ్యనుండు.. 

సాధనమున పనులు సమకూరు ధర లోన’ 

అన్న వేమన మాటలను అమలుచేశారు. పుస్తకాలను బట్టీపట్టడం కాదు.. విదేశీయులతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని అనుకున్నారు. అలా మొదలయింది వారి సాధన. ఉపాధ్యాయుల సహకారంతో విదేశాల్లోని టీచర్లు, విద్యార్థులతో రోజులతరబడి మాట్లాడారు. సర్కారు స్కూల్లో చదువుకుంటూనే ఇప్పుడు ఇంగ్లిష్‌లో ప్రపంచంతోనే మాట్లాడేస్తున్నారు. సాధనలో భాగంగా పదిరోజులకోసారి అమెరికా, రష్యా, ఇంగ్లాండ్‌, ఫిలిప్పీన్స్‌, గ్రీస్‌, జాంబియా తదితర దేశస్తులతో ముచ్చటిస్తున్నారు. టీచర్‌ ఉమ్మాజి పద్మప్రియ ఆలోచన, కృషి ఫలితంగా ఇది సాధ్యమయింది.

స్కైప్‌ ద్వారా సాధన

ఐక్య రాజ్యసమితి (యూఎన్‌) టీచర్‌ ఎక్సేంజి ప్రోగ్రాంలో భాగంగా ఇసా బెల్లా సల్దానా, జాక్వెలిన్‌, టీనాబ్యాంక్స్‌ అనే ముగ్గ్గురు అమెరికాకు చెందిన టీచర్లు నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలకు వచ్చారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇసా బెల్లా ఏడాదిపాటు ఇక్కడే ఉన్నారు. దీని ఫలితంగా పాఠశాలలోని విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీద పట్టు ఏర్పడింది. ఇతర దేశాల విద్యార్థులతో ఇంగ్లిష్‌లోనే సంభాషించడం మొదలుపెట్టారు. దీనికి కొనసాగింపుగా వారానికి, పదిరోజులకోసారి విదేశాల్లోని వారితో ఇంగ్లిష్‌లో మాట్లాడించడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగయ్యాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఏ దేశస్తులతోనైనా మాట్లాడగలిగేస్థాయికి విద్యార్థులు ఎదిగారు.

ఇంగ్లిష్‌ అంటే భయం లేదు

స్కూల్‌ లైబ్రరీలో ఇంగ్లిష్‌ స్టోరీ బుక్స్‌ ఇస్తారు. ఇంగ్లిష్‌ డిజిటల్‌ క్లాసు లు నడుస్తున్నాయి. కల్చరల్‌ యాక్టివిటీస్‌ను ఇంగ్లిష్‌లోనే నిర్వహిస్తారు. అమెరికాకు చెందిన టీచర్‌ ఇషాబెల్లాతో నూ ఇంగ్లిష్‌లో మాట్లాడేదాన్ని. విదేశీయాస లో మాట్లాడేందుకు ప్రయత్నించేదాన్ని. ఈ ఇంగ్లిష్‌తో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలనన్న నమ్మకం కలిగింది. డాక్టర్‌ అయి అమెరికాలో స్థిరపడ్తా. ఇంగ్లిష్‌ అంటే భయంలేదు.

-జ్యోత్స్న, 9వ తరగతి, ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాల, మలక్‌పేట

ఆంగ్లంలోనే సంభాషణ

నేను, మా అక్క ఇదే స్కూల్లో చదువుతున్నాం. రెండో తరగతి నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడటం అలవాటు చేసుకున్నా. మొదట్లో తప్పులు దొర్లేవి. భయమేసేది. టీచర్లు వెనకుండి తప్పులను సవరించేవారు. అప్పటినుంచే ఇంగ్లిష్‌ అంటే ఇష్టం ఏర్పడింది. తోటి విద్యార్థులతో మాట్లాడటం వల్ల భయం పోయింది. ఇషాబెల్లా టీచర్‌ అప్పుడప్పుడు పాఠాలు చెప్తుండేవారు. ఇంటరాక్ట్‌ అయ్యేవారు. భయపడకుండా వారితో మాట్లాడేవాళ్లం. 

- నందిని, 9వ తరగతి విద్యార్థిని

విదేశీయులతో మాట్లాడుతున్నా

స్కూల్‌లో ఇంగ్లిష్‌ మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు గుర్తుకొచ్చేవికాదు. స్కూల్లో ఇంగ్లిష్‌ పేపర్‌ను చదివేదాన్ని. స్కైప్‌, వీడియోకాల్స్‌ ద్వారా వివిధ దేశాల వాళ్లతో వారానికి, పదిరోజులకోసారి ఇంగ్లిష్‌లో మాట్లాడేవాళ్లం. వారు మాట్లాడేటప్పుడు ఉచ్చారణ సమస్య తలెత్తేది. రోజులు గడిచిన కొద్దీ అంతా అలవాటయింది. ఫలితంగా అమెరికా, బ్రిటన్‌ వాళ్లతో నిమిషాలకొద్దీ మాట్లాడుతున్నాం.

- సనాబేగం, పదో తరగతి విద్యార్థిని


logo