బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 00:58:51

కాంగ్రెస్‌కు ‘డబుల్‌' ట్రబుల్‌

కాంగ్రెస్‌కు ‘డబుల్‌' ట్రబుల్‌

  • రెండోరోజూ కొనసాగిన ‘డబుల్‌ సవాల్‌'
  • మధ్యలోనే నిష్క్రమించిన కాంగ్రెస్‌ నేతలు
  • చూసి ఓర్వలేక తప్పించుకున్నారన్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: డబుల్‌ సవాల్‌ రెండోరోజున కాంగ్రెస్‌ పార్టీ ట్రబుల్‌లో పడింది. కాంగ్రెస్‌ నాయకులు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కండ్లతో చూసి ఓర్వలేక మధ్యలోనే తోకముడిచారు. స్వయంగా మంత్రులే చూపిస్తున్నా.. అకారణంగా ఇండ్లబాటపట్టారు. అసెంబ్లీలో విసిరిన సవాల్‌లో భాగంగా రెండోరోజు శుక్రవారం మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. కాంగ్రెస్‌ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క, ఆ పార్టీ సీనియర్‌ నాయకులు వీ హనుమంత్‌రావు, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని తీసుకుని శుక్రవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. మహేశ్వరం మంఖాల్‌, కీసర, రాంపల్లిలో కొత్తగా నిర్మించిన ఇండ్ల సముదాయాలను ప్రత్యక్షంగా చూడాలని కోరారు. ఇండ్ల నాణ్యతను పరిశీలించి అవాక్కయిన ప్రతిపక్ష నాయకుల నోట మాట రాలేదు. రాంపల్లిలో ఇండ్లను పరిశీలించిన అనంతరం భట్టి మాట్లాడుతూ.. నగరంలో కాకుండా శివార్లలో ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. దీనికి మంత్రి తలసాని స్పందించారు. నగరంలో సరైన స్థలం లేక శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో విశాలంగా సముదాయాలను నిర్మించామని తెలిపారు. రెండుచోట్ల ఇండ్లను చూసిన తర్వాత.. కారణం చెప్పకుండానే మల్లుభట్టి, వీ హనుమంతరావు రాంపల్లి నుంచే వెనుదిరిగారు. అహ్మద్‌గూడ నుంచి కొల్లూరు వరకు ఆరు ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉండగా, మధ్యలోనే కాంగ్రెస్‌ నాయకులు తిరుగుముఖం పట్టారు. వాస్తవాన్ని కండ్లతో చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ నాయకులు పలాయనం చిత్తగించారని మంత్రులు తలసాని, మల్లారెడ్డి ధ్వజమెత్తారు. నగరంలో వందల ఎకరాల భూమి ఉన్నదంటున్న కాంగ్రెస్‌ నాయకుడు భట్టి విక్రమార్క.. వారి ప్రభుత్వ హయాంలో శివారులో ఇండ్లు ఎందుకు నిర్మించారో చెప్పాలని నిలదీశారు.  


logo