ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 19:08:17

‘కృష్ణా’ బోర్డుకు తెలంగాణ ప్రాజెక్టులపై ప్రజంటేషన్‌

‘కృష్ణా’ బోర్డుకు తెలంగాణ ప్రాజెక్టులపై ప్రజంటేషన్‌

హైదరాబాద్‌: కృష్ణా జలాల విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల ఫిర్యాదుల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్లు తమ వాదనలు వినిపించారు. కాగా, బోర్డు సమావేశంలో తెలంగాణ తరఫున వినిపించిన వాదనలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ వెల్లడించారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌ ఇచ్చామని రజత్‌ కుమార్‌ తెలిపారు. 16.5 టీఎంసీలు హైదరాబాద్‌కు రావాలనే విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తాగునీటి కేటాయంపులను 20 శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించి ఆ మేరకు అదనపు జలాలను ఇవ్వాలని కోరినట్లు రజత్‌ కుమార్‌ చెప్పారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పలు పెండింగ్‌ అంశాల గురించి బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 


logo