గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 15:35:47

పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి

పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి

సిద్దిపేట : కొవిడ్ -19 నేపథ్యంలో  పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని మరింత సౌకర్యవంతం చేసే దిశగా ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని జిల్లా కలెక్టర్  వెంకట్రామ్ రెడ్డి  తెలిపారు. నూతన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించిందని అయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.

ఎన్నికల ఓటరు జాబితాలో గుర్తించబడిన 80 ఏండ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులందరికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఐచ్ఛికాన్ని ఎంచుకోవడానికి అవసరమైన పత్రాలను వారి ఇండ్లకే సంబంధిత బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌వో) పంపిస్తారని తెలిపారు .వారిలో ఎవరైనా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని ఎంచుకుంటే వారి ఇంటికి బీఎల్‌వో వచ్చి వారితో 12-డీ ఫాంలను పూరించేలా చేస్తారని వివరించారు. ప్రస్తుతం 12-డీ ఫాంలు అందించి అంగీకారం తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందన్నారు .

దుబ్బాక నియోజకవర్గంలో అంగీకారం తెలుపుతూ పూరించిన 12-డీ ఫాం పత్రాలను ఈ నెల 14 వ తేదీ కల్లా  బీఎల్‌వోలు  రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌వో)కి సమర్పిస్తారని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లు ముద్రించిన అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఎలా వేయాలో ఎన్నికల బృందం సభ్యులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. పోలింగ్‌కు ముందు రోజు వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పారదర్శకత కోసం ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తారని పేర్కొన్నారు.

సర్వీస్‌ ఓటర్లకు అందించే పోస్టల్‌ బ్యాలెట్‌కు దీనికి సంబంధం లేదని, ఇందులో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కావాలనుకున్నవారే సంబంధిత పత్రాలు నింపాల్సి ఉంటుందని వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేసారు. అంతేకాకుండా కొవిడ్‌ బాధితులు, స్వీయ నిర్భందంలో ఉన్నవారికి సైతం ఈ‌ అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని దుబ్బాక నియోజకవర్గానికి చెందిన పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, వృద్ధులు, కొవిడ్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


logo