శనివారం 04 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 02:09:02

తాసిల్దార్‌ సుజాత భర్త ఆత్మహత్య

తాసిల్దార్‌ సుజాత భర్త ఆత్మహత్య

  • చిక్కడపల్లిలో భవనంపై నుంచి దూకి బలవన్మరణం
  • ఏసీబీ విచారణను ఎదుర్కోవడంపై కలత
  • భార్య రిమాండ్‌లో ఉండటంతో మనస్తాపం
  • అజయ్‌ ఆత్మహత్య దిగ్భ్రాంతికరం: ట్రెసా

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ దోమలగూడ: హైదరాబాద్‌లోని షేక్‌పేట తాసిల్దార్‌ చింతల సుజాత భర్త అజయ్‌కుమార్‌ (47) ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ స్థల వివాదంలో ఇటీవల ఏసీబీ అధికారులు తాసిల్దార్‌ సుజాతపై కేసు నమోదుచేసుకుని రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఆమె భర్త, ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అజయ్‌కుమార్‌ చిక్కడపల్లిలో సోదరి ఉండే ఐదంతస్తుల భవనం పైనుంచి దూకారు. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. పోలీసులు అజయ్‌ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సుజాత, అజయ్‌కుమార్‌కు 13 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. ఏసీబీ అధికారి అచ్యుతేశ్వర్‌రావు వేధింపుల వల్లే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్టు అజయ్‌ సోదరి మంగళ ఆరోపించారు. బావ ప్రదీప్‌రాజ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉస్మానియాలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

4,865 గజాల స్థలం వివాదం

షేక్‌పేట మండల పరిధి బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ -14లోని సర్వేనంబర్‌ 403లో సుమారు 4,865 గజాల స్థలం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ స్థలం విషయంలో కేసులు, కోర్టు విచారణలు, వివాదాల నేపథ్యంలో షేక్‌పేట తాసిల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్టుచేశారు. భార్య రిమాండ్‌ ఉండటం, ఏసీబీ అధికారులు తనను విచారించడం వంటి కారణాలతో కలత చెంది అజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. తాసిల్దార్‌ సుజాత భర్త ప్రొఫెసర్‌ అజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ఆవేదన వ్యక్తంచేసింది. బుధవారం ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సుజాత అరెస్ట్‌తో ఆమె కుటుంబసభ్యులు మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజయ్‌ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. 


logo