ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:33

తాసిల్దార్‌ సుజాత అరెస్టు

తాసిల్దార్‌ సుజాత అరెస్టు

  • ఆమె స్థానంలో అమీర్‌పేట తాసిల్దార్‌కు బాధ్యతలు

హైదరబాద్‌/ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో షేక్‌పేట్‌ తాసిల్దార్‌ సుజాతను పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని ఓ స్థల వివాదం సెటిల్‌మెంట్‌ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఆమెను సోమవారం అధికారులు ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఆరుగంటల సేపు విచారించారు. ఏసీబీ అధికారుల సోదాల్లో సుజాత ఇంట్లో శనివారం పట్టుబడ్డ రూ.30 లక్షలు, పలు కీలక డాక్యుమెంట్లు లభించడంపై  ఆరాతీశారు. నగదు, బంగారానికి సరైన పత్రాలు చూపలేకపోవడంతో ఆమెపై కేసు నమోదుచేసినట్టు తెలిసింది. సాయంత్రం 4.45 గంటల సమయంలో సుజాతను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. అనంతరం జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. 

సుజాత సూచనల మేరకు రూ.30 లక్షలు డిమాండ్‌ చేసి, రూ.15 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, ఎస్సై రవీందర్‌రెడ్డి ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కాగా, సుజాతను హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి సోమవారం బదిలీచేశారు. ఆమెను కలెక్టరేట్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఆమె స్థానంలో అమీర్‌పేట తాసిల్దార్‌ వీవీఎల్‌ చంద్రకళకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆర్‌ఐ నాగార్జునరెడ్డిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏసీబీ నుంచి నివేదిక రాకపోవడంతో ఆలస్యమవుతున్నదని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని ఓ అధికారి నమస్తే తెలంగాణకు చెప్పారు.


logo