శనివారం 04 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 02:43:18

స్టార్టప్స్‌కు అడ్డా తెలంగాణ

స్టార్టప్స్‌కు అడ్డా తెలంగాణ

  • ప్రపంచ టాప్‌ 30 స్టార్టప్‌లలో రాష్ట్రం
  • వర్ధమాన ఎకోసిస్టమ్స్‌లో హైదరాబాద్‌
  • భాగ్యనగరంలో 4 వేలకుపైగా స్టార్టప్‌లు
  • ఆర్థికవ్యవస్థలను మార్చే అంకుర సంస్థలు
  • గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ ఐటీరంగం దూసుకుపోతున్నది. స్టార్టప్‌ల కేంద్రంగా మారిన హైదరాబాద్‌ నగరం తాజాగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. స్టార్టప్‌లను నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే ఎకోసిస్టమ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 ప్రదేశాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. వర్ధమాన ఎకోసిస్టమ్స్‌లో ఈ ఏడాది ఎంపికచేసిన టాప్‌ 100 ప్రదేశాలలో హైదరాబాద్‌ కూడా వాటిలో ఒకటిగా ఉన్నది. గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, స్టార్టప్‌ జీనోమ్‌ సంస్థలు సంయుక్తంగా గురువారం ‘గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌-2020 (జీఎస్‌ఈఆర్‌)’ నివేదికను విడుదలచేశాయి.

స్టార్టప్‌లపై సమగ్రమైన, ప్రామాణికమైన నివేదికగా జీఎస్‌ఈఆర్‌ను ప్రపంచవ్యాప్తంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 300 ఎకోసిస్టమ్స్‌ను అధ్యయనంచేసి ఈ నివేదికను రూపొందించారు. వీటి నుంచి టాప్‌ 30ని ఎంపికచేశారు. అలాగే 100 వర్ధమాన ఎకోసిస్టమ్స్‌ను ఎంపిక చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది స్టార్టప్‌లలో నాలుగు మాత్రమే మన్న గలుగుతున్న పరిస్థితుల్లో ఈ నివేదిక విడుదల కావడం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొంది. 

తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం

తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇన్నొవేషన్‌ హబ్‌లు, సపోర్ట్‌ ఆర్గనైజేషన్లు అందిస్తున్న సహకారం వల్లనే రాష్ర్టానికి వేల సంఖ్యలో స్టార్టప్‌లు తరలివస్తున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. నేడు హైదరాబాద్‌లోనే నాలుగువేలకు పైగా స్టార్టప్‌లున్నట్టు ఆ నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావంచూపగల విస్తృతమైన సామ ర్థ్యం, తెలంగాణ ఇన్నోవేషన్‌కు, సాంకేతికంగా బలంగా ఉన్న ఇక్కడి ఎకోసిస్టమ్‌కు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టార్టప్‌లలో తెలంగాణ రాష్ట్రం నిలవడం చాలా గర్వంగా ఉన్నదని టీ హబ్‌ సీఈవో, చీఫ్‌ ఇన్నొవేషన్‌ ఆఫీసర్‌ రవి నారాయణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్ల ఐదేండ్ల కాలంలోనే హైదరాబాద్‌ స్టార్టప్‌లకు హబ్‌గా అవతరించిందని చెప్పారు.


logo