హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): టీ-హబ్ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న రెండో ఎడిషన్ టీ-ఏంజిల్ కార్యక్రమానికి 21 స్టార్టప్స్ ఎంపికయ్యాయి. ఇవి 45 రోజులపాటు సాగే బూట్ క్యాంప్‌లో ఏంజిల్ ఇన్వెస్టర్ల మద్దతు పొందనున్నాయి. ప్రతి స్టార్టప్‌కు కనీసం రూ.50 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చే అవకావం ఉన్నదని టీ-హబ్ పేర్కొన్నది. టీ-ఏంజిల్‌కు ఎంపికైన వాటిలో కనీసం 10 స్టార్టప్స్ అయినా ఆర్థిక మద్దతు పొందాలని టీ-హబ్ లక్ష్యంగా పెట్టుకున్నది. టీ-ఏంజిల్‌లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల స్టార్టప్స్ నుంచి మొత్తం 250 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఫిట్నెస్, మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్, ఎన్విరాన్మెంట్ సర్వీసెస్, డ్రోన్ ఇండస్ట్రీ, సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర రంగాలకు చెందిన స్టార్టప్స్ ఉన్నాయి.