గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 10, 2020 , 03:52:15

డిసెంబర్‌ నాటికి టీ-హబ్‌ రెండోదశ

డిసెంబర్‌ నాటికి టీ-హబ్‌ రెండోదశ

  • ఒకే వేదికపై వెయ్యికిపైగా స్టార్టప్‌లు
  • తొలుత 25వేల మందికి ఉపాధి
  • సర్కార్‌ ఖర్చుతో టైర్‌-2 సిటీల్లో స్టార్టప్‌లు
  • శాసనసభలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీ-హబ్‌ రెండో దశ ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా అందుబాటులోకి వస్తుందని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. నాలుగు వేల మంది ఔత్సాహిక అంకుర పారిశ్రామికవేత్తల కోసం రాయదుర్గం ప్రాంతంలోని మూడెకరాల్లో 3.5 లక్షల చదరపు అడుగుల్లో రూ.276.26 కోట్లతో టీ-హబ్‌ రెండోదశ నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇది పూర్తయితే ఒకే సెంటర్‌లో వెయ్యికిపైగా స్టార్టప్‌లు ఉంటాయన్నారు. మొదటిదశ టీ-హబ్‌ ద్వారా 25వేల మందికిపైగా యువతకు ఉపాధి కల్పించినట్టు తెలిపారు. ప్రత్యక్షంగా 1120 స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వగా అవి రూ.1800 కోట్లకుపైగా నిధులను సేకరించాయన్నారు. శాసనసభలో బుధవారం ఎమ్మెల్యేలు వివేకానంద, జీవన్‌రెడ్డి, సైదిరెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. గత ఐదేండ్లలో దేశంలోనే అతిపెద్ద, అతి ఉత్తమ ఇంక్యుబేటర్‌గా టీ-హబ్‌ నిలిచిందన్నారు. ఈ కాలంలో స్టార్టప్‌ల సంఖ్య 400 నుంచి రెండు వేలకుపైగా పెరిగినట్టు తెలిపారు. టీ-హబ్‌ ద్వారా 400 పైచిలుకు కార్పొరేట్‌ కంపెనీలు కూడా కార్పొరేట్‌ ఇన్నొవేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయని తెలిపారు. ఐటీ అభివృద్ధిని గ్రేడ్‌-2 నగరాలకు విస్తరించేందుకు ప్రభుత్వ ఖర్చుతో కరీంనగర్‌లో రూ.40 కోట్లతో, నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో, వరంగల్‌లో రూ.60 కోట్లతో, ఇంకా ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో పెద్ద మొత్తం లో డబ్బు సమకూర్చి స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 

రైతులకు సాంకేతికతతో అవగాహన

రైతువేదికలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చి సాంకేతికత ఆధారంగా రైతులకు మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇక్రిశాట్‌తో కలిసి వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్‌ పరిశోధనలు కూడా చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇక్రిశాట్‌లో ఐ-హబ్‌ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. విద్యార్థులకు ఇన్నోవేషన్‌, స్టార్టప్‌లపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 120 కాలేజీలు, వందల హైస్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ను స్థాపించినట్లు చెప్పారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకోసం వీ-హబ్‌ను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఇన్నోవేషన్‌లో సహకారం కోసం ఎనిమిది రాష్ర్టాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఇతర దేశాల స్టార్టప్‌లను మనం ఆహ్వానించడానికి, మన స్టార్టప్‌లను ఇతర దేశాలకు పంపించేందుకు వారధిగా టీ-బ్రిడ్జ్‌ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్టార్టప్‌లకు సంబంధించి తెలంగాణ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం మరే రాష్ట్రం కూడా ఇవ్వడంలేదని కేటీఆర్‌ స్పష్టంచేశారు.


logo