బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 09, 2020 , 01:17:21

రాష్ట్ర ఐటీశాఖకు ప్రతిష్ఠాత్మక అవార్డు

రాష్ట్ర ఐటీశాఖకు ప్రతిష్ఠాత్మక అవార్డు
  • టీహబ్‌ బ్లాక్‌చైన్‌ ప్రాజెక్టుకు ఈ-గవర్నెన్స్‌ గోల్డెన్‌ పురస్కారం
  • కేంద్ర మంత్రి చేతులమీదుగా ప్రదానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకొన్నది. కేంద్ర ప్రభుత్వ రిఫార్మ్స్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ (డీఏఆర్పీజీ), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాలు ఎక్సలెన్స్‌ ఇన్‌ అడాప్టింగ్‌ టెక్నాలజీస్‌ పోటీలో రాష్ట్ర ఐటీశాఖ బ్లాక్‌చైన్‌ ప్రాజెక్టుకు ఈ -గవర్నెన్స్‌ 2019-20 గోల్టెన్‌ అవార్డును గెలుచుకొన్నది. శనివారం ముంబైలో జరిగిన 23వ జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ చేతులమీదుగా రాష్ట్ర ఐటీ ఈఅండ్‌సీ శాఖ ఎమర్జింగ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ రమాదేవి ఈ అవార్డును అందుకొన్నారు. టీహబ్‌ బ్లాక్‌చైన్‌ ప్రాజెక్టులోని టీ-చిట్స్‌ విభాగం ఈ అవార్డును దక్కించుకొన్నది. టీ-చిట్స్‌ విధానంలో భద్రమైన, స్మార్ట్‌ లావాదేవీలు జరిపేందుకు వీలుంటుందని, ఈ విధానం ద్వారా ఒక్క ఏడాదిలోనే 10.08 లక్షలమంది వినియోగదారులు రూ.18,549 కోట్ల లావాదేవీలు జరిపారని రమాదేవి వివరించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. 


logo