శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 24, 2020 , 14:40:51

టీ క‌ల్చ‌ర్ మొబైల్ యాప్ ఆవిష్క‌ర‌ణ‌

టీ క‌ల్చ‌ర్ మొబైల్ యాప్ ఆవిష్క‌ర‌ణ‌

హైద‌రాబాద్ : టీ క‌ల్చ‌ర్‌(T - CULTURE) మొబైల్ యాప్‌ను రాష్ర్ట ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌శాఖ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ నేడు ఆవిష్క‌రించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA)  సహకారంతో ఈ ప్ర‌త్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారు. మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి కె.ఎస్‌. శ్రీనివాస రాజుతో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కళల ఖజానా అన్నారు.  రాష్ట్రంలో ఎంతో మంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులున్నారన్నారు. వారందరికి సంభందించిన స‌మాచారాన్ని ఆన్ లైన్ లో అదేవిధంగా  మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు తెలియ‌జేయ‌నున్న‌ట్లు చెప్పారు. అదేవిధంగా కళాకారులను ప్ర‌జ‌ల‌కు మరింత చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 

రాష్ర్టావ‌త‌ర‌ణ త‌ర్వాత సీఎం సీఎం కేసీఆర్ కళాకారులకు పూర్వవైభవం తీసుకువ‌చ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టార‌న్నారు. వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. అందులో భాగంగా కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వ‌డం. మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులకు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా  ఆన్ లైన్ ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేసే విధానం చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. కళాకారుల డేటా బేస్ ను రూపొందించి వారి జన్మస్థలం, కళారూపం, వయస్సు, చదువు, సాధించిన విజయాలు వంటి విషయాలు యాప్ ద్వారా ప్రజలకు, కళాకారుల సమాచారం కోసం ప్రత్యేకంగా టీ క‌ల్చ‌ర్ పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్ దేశంలోనే మొదటి ప్రయత్నం అన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళాకారులకు సైతం సులభంగా ఉండేందుకు ఈ మొబైల్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతేగాక కళాకారులకు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని మీ సేవతో అనుసంధానం చేశామన్నారు. ఐడీ కార్డు కావాలనుకునే కళాకారులెవరైనా తమ వివరాలు, వారి కళా ప్రదర్శన వివరాలు, వారి గురించి పత్రికలలో వచ్చిన కథనాలను మీ సేవ సెంటర్ లలో సమర్పించి 30 రోజులలో తమ గుర్తింపు కార్డులు పొంద‌వ‌చ్చ‌న్నారు. ఈ యాప్ 1 ఆగస్టు, 2020 నుండి అందుబాటులో ఉంటుందన్నారు. కాగా మొదటి కార్డును కవి, కళాకారుడు, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు మంత్రి అంద‌జేశారు. 



logo