ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:39

‘టీ-బ్లాక్‌' మలివిడుత శిక్షణకు 30 స్టార్టప్‌లు

 ‘టీ-బ్లాక్‌' మలివిడుత శిక్షణకు 30 స్టార్టప్‌లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘టీ-బ్లాక్‌ యాక్సిలరేటర్‌' మలివిడుత శిక్షణ కోసం 30 స్టార్టప్‌లను ఎంపిక చేసింది. వీటికి శిక్షణ అందించేందుకు నాలుగు అంతర్జాతీయ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది. టెజోస్‌ ఇండియా, ఆర్‌3 కోర్డా, సెటిల్‌మింట్‌ సంస్థలు ప్లాట్‌ఫామ్‌ భాగస్వాములుగా, స్విట్జర్లాండ్‌కు చెందిన సీవీ ల్యాబ్స్‌ హబ్‌ భాగస్వామిగా కొనసాగుతాయని టీ-బ్లాక్‌ పేర్కొన్నది. ఎంపిక చేసిన 30 స్టార్టప్‌లకుమూడు వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చిన స్టార్టప్‌లను వడబోస్తారు. ఎంపికైన స్టార్టప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో టెక్‌ మహీంద్రా, సీ-డాక్‌, ఐఐసీటీకి చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారి ఆలోచనలకు వాస్తవరూపం కల్పించే అవకాశమిస్తారు. ప్రభుత్వం పనితీరును మెరుగుపరుచుకునేందుకు సరికొత్త సాంకేతిక విధానాలపై దృష్టిపెట్టిన రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నదని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. బ్లాక్‌చెయిన్‌ సాంకేతికతలో తెలంగాణను ప్రపంచ రాజధానిగా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం టెక్‌ మహీంద్రాతో కలిసి టీ-బ్లాక్‌ యాక్సిలరేటర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 


logo