శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 22:00:37

నిర్లక్ష్యంపై సస్పెన్షన్ వేటు..

నిర్లక్ష్యంపై సస్పెన్షన్ వేటు..

నల్లగొండ: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు పడింది. నల్లగొండ జిల్లా కేతే పల్లి మండలం ఉప్పలపహాడ్,పెద్దవూర మండలం పాల్తితండా సర్పంచ్ లు, తిరుమలగిరి సాగర్ మండలం ఆల్వాల, గుండ్లపల్లి మండలం సింగరాజు పల్లి పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్  బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉప్పలపహాడ్ సర్పంచ్ గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ది, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిర్లక్ష్యం వహించడం, పాల్తితండా సర్పంచ్ గ్రామంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఓ.హెచ్.ఎస్.అర్ ట్యాంక్ కూల్చి వేయడంపై డివిజనల్ పంచాయతీ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అలాగే, తిరుమలగిరి సాగర్ మండలం ఆల్వాల సర్పంచ్ పల్లె ప్రగతి పనులు, పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం, గుండ్లపల్లి మండలం సింగరాజుపల్లి సర్పంచ్ ఆస్తి పన్ను సకాలంలో జమ చేయక పోవడం కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యారు.  మార్చి -సెప్టెంబర్ వరకు తిప్పర్తి మండలం ఏ. దుప్పలపల్లి, తిప్పర్తి, కట్టంగూర్ మండలం పామనగండ్ల, గుర్రంపో డ్ మండలం జూనూతల, చింతపల్లి మండలం గడియగౌరారం, చిట్యాల మండలం ఏపూర్ పంచాయతీ కార్యదర్శులను హరితహారం, పల్లె ప్రగతి పనులు, పారిశుధ్యం,ఆస్తి పన్ను జమ చేయక పోవడం, అక్రమ లేఅవుట్లకు అనుమతి మంజూరు కారణాలతో సస్పెండ్‌ చేశారు.   

ఐదుగురు ఉపసర్పంచ్‌లను..

ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చందంపేట యాపాలబాయితండా, నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి, గుండ్లపల్లి మండలం పెద్ద తండా, కొండమల్లెపల్లి గన్యానాయక్తండా, తిరుమలగిరిసాగర్ మండలం ఎర్ర చెరువుతండా ఉప సర్పంచులను చెక్కులపై సంతకాలు పెట్టని కారణంగా సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల పలువురు పంచాయతీ అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యంవహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.