మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 02:46:38

మనుమళ్లకు కరోనా వస్తదేమోనని ఆత్మహత్య

మనుమళ్లకు కరోనా వస్తదేమోనని ఆత్మహత్య

  • వైరస్‌ సోకిందని అనుమానం
  • ప్రాణాలొదిలిన నాయనమ్మ, తాత
  • హైదరాబాద్‌లో విషాదం

తొంభై ఏండ్ల వృద్ధులు సైతం గాంధీ దవాఖానలో కరోనాను జయించారు. ఇతర అనారోగ్యం లేకుంటే హోంఐసొలేషన్‌లో పదిరోజులు చికిత్స పొందినా కరోనాను జయించవచ్చు.  కానీ చికిత్సపై కొరవడిన అవగాహన, రోగులను భయపెట్టేలా కొన్ని మీడియా సంస్థల విపరీత ప్రచారం ఇద్దరు వృద్ధులను బలిగొన్నది. ముదిమి వయసులో మనుమళ్లతో సంతోషంగా గడుపుతున్న వేళ కరోనా అనుమానం పెనుభూతమైంది. వైరస్‌ సోకిన లక్షణాలు ఉన్నాయనే భయం ఆత్మహత్యకు దారితీసింది. ‘పాడు వైరస్‌ మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు. కానీ, మా వల్ల మనుమళ్లకు ఏమైనా అయితే మేం తట్టుకోగలమా? మేం లేకపోయినా వాళ్లు కలకాలం సల్లగుండాలె’ అంటూ ఓ నాయనమ్మ, తాత ప్రాణాలు తీసుకున్నారు. సీజనల్‌గా వచ్చే దగ్గు, జ్వరానికి భయపడి ప్రాణాలు తీసుకున్నారు.

ఖైరతాబాద్‌: కరోనా సోకిందన్న అనుమానంతో వృద్ధ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ పంజాగుట్ట పోలిస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్‌నగర్‌ మక్తాకు చెందిన వై వెంకటేశ్వర్‌ నాయుడు (65) ఓ కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేసి పదవీవిరమణ పొందాడు. ఆయన భార్య వెంకటలక్ష్మి(60) గృహిణి. వెంకటేశ్వర్‌ నాయుడు దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా, వారికి పెండ్లిళ్లు జరిగి స్థిరపడ్డారు. పది రోజులుగా దంపతులిద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. మందులు వేసుకున్నా ఫలితం కనిపించలేదు. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆందోళనకు గురయ్యారు. నిర్ధారణ పరీక్షలు చేయించకుండానే వైరస్‌ బారినపడ్డామని భయపడ్డారు. శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వారి కుమారుడు నాగరాజు.. కిటికీలోనుంచి చూడగా తల్లిదండ్రులు మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే వారు మృతిచెందారు. 

సూసైడ్‌నోట్‌ లభ్యం

వెంకటేశ్వర్‌ నాయుడు, వెంకటలక్ష్మి మృతదేహాల వద్ద పంజాగుట్ట పోలీసులకు ఓ సూసైడ్‌ లేఖ లభించింది. తమకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, నిత్యం ఇంటికి వచ్చే మనమండ్లకు ఈ వ్యాధి అంటుకునే ప్రమాదం ఉన్నదని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అందులో పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించిన పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదుచేశారు.logo