బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 03:26:51

డబ్బు కోసమే బాలుడి కిడ్నాప్‌

డబ్బు కోసమే బాలుడి కిడ్నాప్‌

  • సూర్యాపేటలో బాలుడి మిస్సింగ్‌ మిస్టరీ సుఖాంతం
  • పట్టుబడిన ముగ్గురు కిడ్నాపర్లు
  • 43 గంటల తరువాత తల్లి ఒడికి చేరిన బాలుడు

సూర్యాపేట టౌన్‌: సూర్యాపేటలో బాలుడి మిస్సింగ్‌ మిస్టరీ ఎట్టకేలకు సుఖాంతమైంది. సినీఫక్కీలో సుమారు 43 గంటలపాటు తీవ్ర ఉత్కంఠరేపిన కిడ్నాప్‌ కేసును ఎస్పీ భాస్కరన్‌ ప్రత్యేక బృందాలతో  ఛేదించారు. బాలుడు క్షేమంగా తల్లిఒడికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు సూర్యాపేటజిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ భాస్కరన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే గౌతమ్‌ను కిడ్నాప్‌ చేశారని, నిందితులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా మాచర్ల మండలానికి చెందిన వారని తెలిపారు. ముగ్గు రు కిడ్నాపర్లలో యాదాల వెంకటేశ్వర్లుతోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారన్నారు. వారు 13న రెక్కీ నిర్వహించి.. గౌతమ్‌ ఇంటి చుట్టు పక్కల వారి ఫోన్‌ నంబర్లు సేకరించా రు. ఆ రాత్రి సూర్యాపేటలోని లాడ్జిలో ఉండి పథకం ప్రకా రం 14న గౌతమ్‌ను కిడ్నాప్‌ చేసి నల్లగొండజిల్లా మిర్యాలగూడ తీసుకెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం నిందితుల్లో ఒకడు బాలుడ్ని తీసుకుని బస్సులో హైదరాబాద్‌కు వెళ్లాడు. మిగిలిన ఇద్దరు తెలివిగా వ్యవహరించి బాటసారుల వద్ద నుంచి ఫోన్‌లు అడిగి తీసుకొని వాటితో బాలుడి తండ్రికి ఫోన్‌ చేసి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే బాలుడిని చంపుతామని బెదిరించారు. చివరకు రూ.7లక్షలకు ఒప్పందం కుదిరింది. డబ్బుల కోసం ఈసారీ వారి సొంత నంబర్‌నుంచి ఫోన్‌ చేయడంతో ఆచూకీ కనుక్కోవడం సులువైంది. ఒప్పందం కాగానే హైదరాబాద్‌కు బాలుడితోపాటు వెళ్లిన వ్యక్తి మళ్లీ మిర్యాలగూడకు వచ్చాడు. మిర్యాలగూడ సమీపంలో కిడ్నాపర్లను నమ్మించి డబ్బులు ఇచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. కిడ్నాప్‌ కేసును డీఎస్పీ మోహన్‌కుమార్‌ నేతృత్వంలో సూర్యాపేట టౌన్‌ సీఐ ఆంజనేయులు,  రూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి ఛేదించారని, వారిని ఎస్పీ భాస్కరన్‌ ప్రత్యేకంగా అభినందించారు. కాగా అందరినీ అప్రమత్తం చేసిన విద్యుత్‌శాఖమంత్రి జీ జగదీశ్‌రెడ్డి, సూర్యాపేట పోలీసులకు గౌతమ్‌ తల్లి నాగలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.