e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home తెలంగాణ చదువుల నెలవు హైదరాబాద్‌

చదువుల నెలవు హైదరాబాద్‌

చదువుల నెలవు హైదరాబాద్‌
  • అత్యధిక కాలేజీలున్న జిల్లాల్లో 3వ స్థానం
  • సర్వే ఆన్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వెల్లడి
  • సర్కారు కళాశాలల జోరుతో ఐదేండ్లలో మూతపడిన 383 ప్రైవేటు కాలేజీలు

హైదరాబాద్‌, జూన్‌ 21 (నమస్తే తెలంగాణ): పదుల సంఖ్యలో యూనివర్సిటీలు, పరిశోధనాలయాలు, వందల్లో విద్యాసంస్థలు.. కాలేజీలు. ఈ వసతులే హైదరాబాద్‌ నగరాన్ని చదువుల నెలవుగా నిలిపాయి. వీటన్నింటి ఫలితంగా హైదరాబాద్‌ అక్షరాలు వెదజల్లే చదువులమ్మచెట్టుగా ప్రసిద్ధికెక్కింది. స్థూలంగా విశ్వవిద్యాకేంద్రంగా వర్ధిల్లుతున్నది. ఇదే విషయాన్ని ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌- 2020 వెల్లడించింది. ఉన్నత విద్యలో అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాల్లో మన హైదరాబాద్‌ దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. 2019- 20 సంవత్సరానికి సర్వే వివరాలను కేంద్రం ఇటీవలే ప్రకటించింది. ఈ సర్వేలో కర్ణాటకలోని బెంగళూరు అర్బన్‌ జిల్లా 1,009 కాలేజీలతో అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లా 606 కాలేజీలతో రెండోస్థానంలో, 482 కాలేజీలతో హైదరాబాద్‌ జిల్లా మూడోస్థానంలో నిలిచింది.

ఎడ్యుకేషన్‌ హబ్‌..
హైదరాబాద్‌ అంటే ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితం.. కానిప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఫార్మా, టూరిజం, డిఫెన్స్‌, ఇన్ఫ్రా, వ్యాక్సిన్ల తయారీ ఇలా ఒక్కో రంగంలో వేగంగా దూసుకుపోతున్నది. ఇదే కోవలో ఎడ్యుకేషన్‌ హబ్‌గాను అవతరించింది. బిట్స్‌ క్యాంపస్‌, టిపుల్‌ ఐటీ, ఐఐటీ హైదరాబాద్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, నల్సార్‌, హెచ్‌సీయూ, మనూ, ఇఫ్లూ లాంటి కేంద్రీయ విద్యాసంస్థలు, రాష్ట్రస్థాయి వర్సిటీలు, ప్రైవేటు వర్సిటీలు, నైపర్‌ లాంటి సంస్థలు సైతం సేవలందిస్తున్నాయి.

- Advertisement -

సర్కారు జోరు.. ప్రైవేటు బేజారు
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో ప్రైవేటు కాలేజీల సంఖ్య పెరుగుతుండగా, తెలంగాణలో మాత్రం పరిస్థితులు భిన్నం గా ఉన్నాయి. సర్కారు కాలేజీల జోరుతో ప్రైవేటు కళాశాలలు బేజారవుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు, సౌకర్యా లు లేమి కారణంగా ఐదేండ్లలో 383 ప్రైవేటు కాలేజీలు మూతపడ్డాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ఐదేండ్ల నుంచి కర్ణాటకలో ప్రైవేటు కాలేజీల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఏపీ, కేరళ, తమిళనాడులో కాలేజీల సంఖ్యలో మార్పులేకపోగా, తెలంగాణలో మాత్రం పలు ప్రైవేటు కళాశాలలు మూతపడ్డాయి. ప్రైవేటు కాలేజీల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెరుగుతున్న రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ముందువరుసలో ఉండగా, తమిళనాడు, తెలంగాణల్లో క్రమంగా తగ్గుతూ వస్తున్నది.

సర్వే ముఖ్యాంశాలు
తెలంగాణలో మొత్తంగా 2,071 కాలేజీలు ఉన్నాయి. 18- 23 ఏండ్ల మధ్య ఉన్న ఒక లక్ష జనాభాకు 53 కాలేజీలుండగా, ఒక్కో కాలేజీలో సరాసరి 545 మంది చేరుతున్నారు.
8,55,415 మంది ప్రైవేటు కాలేజీల్లో, 71,530 మంది ఎయిడెడ్‌, 1,86,272 మంది ప్రభుత్వ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్నారు.
విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలోనూ తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో 2,261 మంది పలు దేశాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు.
తెలంగాణలో 5,508 మంది పీహెచ్‌డీ, 373 మంది ఎంఫిల్‌, మరో 1,84,520 మంది పీజీ కోర్సు చేస్తున్నారు.
ఉన్నత విద్యలో లింగసమానత్వసూచీ క్రమంగా పెరుగుతున్నది. 2015-16 నుంచి 2019-20 వరకు తెలంగాణలో 0.85 నుంచి 1.05కు చేరుకున్నది. ఎస్సీల్లో లింగసమానత్వం 0.90 నుంచి 1.23కు, ఎస్టీల్లో 0.73 నుంచి 0.93కు చేరుకున్నది.
దేశవ్యాప్తంగా 11.53 లక్షల మంది పాలిటెక్నిక్‌ చదువుతుండగా, తెలంగాణలో 66 వేల మంది చదువుతున్నారు. రాష్ట్రంలో మొత్తం విద్యార్థుల్లో 69.8 శాతం బాలురు ఉన్నారు.
జాతీయంగా ప్రైవేటు కళాశాలలు అధికంగా ఉండగా, తెలంగాణలో 80 శాతం ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి.
తెలంగాణలోని సెంట్రల్‌ వర్సిటీలు 3, జాతీయ విద్యాసంస్థలు 2, రాష్ట్ర వర్సిటీలు 15, ప్రైవేటు వర్సిటీ 1, డీమ్డ్‌ వర్సిటీలు 2 ఉన్నాయి.

చదువుల నెలవు హైదరాబాద్‌

విద్యకు హైదరాబాదే బెస్ట్‌
ఉన్నత విద్యకు దేశవ్యాప్తంగా తీవ్ర డిమాండ్‌ ఉన్నది. ఈ అవసరాలను తీర్చేందుకు మరిన్ని కొత్త కాలేజీలు, వర్సిటీలు వచ్చే అవకాశం ఉన్నది. నూతన జాతీయ విద్యావిధానం అమల్లోకి వస్తే ఉన్నత విద్య మరింతగా బలోపేతమవుతుంది. ఆలిండియా హయ్య ర్‌ ఎడ్యుకేషన్‌ సర్వేలో దేశంలో హైదరాబాద్‌ మూడోస్థానంలో నిలవడం సంతోషదాయకం. ఆల్‌ సీజన్స్‌.. ఆల్‌ రీజన్స్‌ హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీ. నంబర్‌ వన్‌ స్థానానికి ఎదిగేలా కృషిచేద్దాం.

ప్రొఫెసర్‌ గుజ్జ గోపాల్‌రెడ్డి, యూజీసీ సభ్యుడు

సహజ అనుకూలతలెన్నో..
స్వాతంత్య్రానికి ముందు, తదనంతర కాలంలో తెలంగాణలో విద్యావ్యాప్తి వేగంగా జరిగింది. ఉస్మానియా వర్సిటీ విద్యావ్యాప్తిలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గురుకులాల ఏర్పాటుతో లక్షల మంది ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారు. సహజంగా హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలు కూడా విద్యాసంస్థల స్థాపనకు, విద్యావ్యాప్తికి దోహదపడుతున్నాయి.
– ప్రొఫెసర్‌ ఎల్లూరి శివారెడ్డి, తెలుగు వర్సిటీ మాజీ వీసీ

ప్రభుత్వ చొరవ ఫలితంగానే
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను, వర్సిటీలను బలోపేతం చేస్తున్న ఫలితంగా ఇది సాధ్యమైంది. విద్యాప్రమాణాలు, నాణ్యతలేమి కారణంగా పలు ఇంజినీరింగ్‌ కాలేజీలను మూసివేసినా హైదరాబాద్‌ జాతీయస్థాయిలో 3వ ర్యాంక్‌ను సాధించడం విశేషం. దేశంలో ఏ పట్టణంలో లేనన్ని సెం ట్రల్‌ వర్సిటీలు, విద్యాసంస్థలు ఇక్కడే ఉన్నాయి. మూడేండ్ల తర్వాత ఏపీతో ఉన్న బంధం పూర్తిగా తొలగిపోనున్నది. దీంతో దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులైనా హైదరాబాద్‌లో చదువుకోవచ్చు.
– ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చదువుల నెలవు హైదరాబాద్‌
చదువుల నెలవు హైదరాబాద్‌
చదువుల నెలవు హైదరాబాద్‌

ట్రెండింగ్‌

Advertisement