గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 01:54:33

విదేశీ ప్రయాణికులపై నిఘా!

విదేశీ ప్రయాణికులపై నిఘా!

-మార్చి 1నుంచి రాష్ర్టానికి వచ్చినవారు 7,277 మంది!

-పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్న తెలంగాణ పోలీసుశాఖ

-ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు సమగ్ర నివేదిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి సన్నద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం వివిధ దేశాల నుంచి తెలంగాణకు వచ్చినవారిపై పూర్తినిఘా పెట్టింది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకువారి వివరాలను సేకరించడం పై పోలీస్‌శాఖ దృష్టి సారించింది. మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, గ్రామాలకు వచ్చిన వివరాలను దాదాపుగా సేకరించిన పోలీసులు.. వాటిని విశ్లేషించే పని మొదలుపెట్టారు. ఇందుకు స్థానిక అధికారుల సహాయాన్ని తీసుకుంటున్నారు. మొత్తం 7,277 మంది ఇతర దేశాల నుంచి దేశంలోని పలు విమానాశ్రయాల్లో దిగి తెలంగాణకు వచ్చినట్టు నిర్ధారించుకున్నారు. వీరిలో ఆరోగ్యంపై అనుమానంఉన్న 1,929 మందిని పోలీసు సిబ్బంది వ్యక్తిగతంగా వెళ్లి విచారించారు. వారిలో 12 మందికి దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలున్నట్టు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల, మేడ్చల్‌, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబాబా ద్‌, మెదక్‌ తదితర జిల్లాలకు చెందిన వారికి చికిత్స అందించగా.. ఎవరికీ కరోనా లక్షణాల్లేవని నిర్ధారించుకున్నారు. చైనా, ఇటలీ, ఇరాన్‌, దక్షిణకొరియా, స్పెయిన్‌, కువైట్‌, ఇండోనేషియా, జర్మనీ, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, నార్వే, జపాన్‌, ఖతార్‌, ఒమ న్‌ తదితర దేశాల నుంచి 7,277 మంది రాష్ర్టానికి వచ్చారు. అందరి వివరాలను సంపూర్ణంగా సేకరించి పోలీసుశాఖ ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదించే అవకాశం ఉన్నది. ఇతరదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలోనే ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ ఉన్నదని, తెలంగాణ స్థానికులెవరికీ వైరస్‌ సోకలేదని ప్రభుత్వం గుర్తించింది. విదేశాల నుంచి వచ్చినవారిద్వారా రాష్ట్రప్రజలకు వైరస్‌ సోకకుండా వారు 14 రోజులపాటు స్వీయ నిర్బంధం విధించుకోవాలని సూచించింది. 

ఎయిర్‌పోర్టులోనే పాస్‌పోర్టులు స్వాధీనం

కరోనా కట్టడికి ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం వివిధ దేశాల నుం చి శంషాబాద్‌లోని ఆర్జీఐకి చేరుకుంటున్న విదేశీ ప్రయాణికుల నుంచి ముందుగా పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుంటున్నది. అనంతరం వారిని అక్కడి నుంచి నేరుగా రాజేంద్రనగర్‌ డివిజన్‌లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి 8గంటల వరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వివిధ దేశాల నుంచి 1,493 మంది వచ్చారు. వారందరినీ 108 వాహనాలు, ప్రత్యేక బస్సుల ద్వారా 15 క్వారంటైన్‌ కేం ద్రాలకు తరలించారు. ప్రయాణికుల లగేజీని డీసీఎంలలో తీసుకొస్తున్నారు. 14 రోజులపాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ప్రత్యేక పర్యవేక్షణ అనంతరం వారికి పాస్‌పోర్టులు, లగేజీని అందజేసి తిరిగి పంపించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

శివానీ గోడుపట్టని జార్జియా

తలలో రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్‌ కోసం పయనమైన తెలంగాణ విద్యార్థినిని జార్జియా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. భువనగిరికి చెందిన ధాత్రక్‌ వెంకటేశ్‌, సరితల కుమార్తె శివానీ జార్జియాలో మెడిసిన్‌ సెకండియర్‌ చదువుతున్నది. ఐదురోజుల క్రితం మెదడులో రక్తం గడ్డకట్టడంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లో అపరేషన్‌ చేయించేందుకు ఏర్పాట్లుచేశారు. స్నేహితులసాయంతో వచ్చేందుకు శివానీ జార్జి యా ఎయిర్‌పోర్టుకు రాగా.. ఆనారోగ్యం కారణం చూపి అక్కడి అధికారులు ప్రయాణానికి నిరాకరించారు. తమ కూతురు పరిస్థితి విషమంగా ఉన్నదని, ప్రభుత్వం చొరవ చూపి శివానీని ఇక్కడకు రప్పించాలని, లేకుంటే తమను అక్కడికైనా పంపించాని ధాత్రక్‌ వెంకటేశ్‌ దంపతులు కోరుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో చిక్కుకుపోయిన తమ కూతురు వైష్ణవిని ఇండియాకు తీసుకురావాలని నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీరాములు, దుర్గాభవానీ కోరారు. వైష్ణవి ఇండియాకు వచ్చేందుకు శుక్రవారం (20వ తేదీ) వరకే టికెట్‌ చెల్లుబాటవుతుందని, హోటళ్లు, మాల్స్‌ మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సింగపూర్‌లోని చంగీ విమానాశ్రయంలో చిక్కుకున్న జడ్చర్లకు చెందిన ఇద్దరు విద్యార్థులను రప్పించేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చొరువతో సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారని వారి తల్లిదండ్రులు తెలిపారు.

112 మంది బుడగజంగాలకు పరీక్షలు 

తొర్రూరు: ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి సుమారు 200 మంది బుడగ జంగాలు వివాహం ని మిత్తం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డివిజన్‌లోని స్వస్థలాలకు చేరుకున్నారు. ఆయా రాష్ర్టాల్లో కరో నా కేసులు అధికంగా ఉన్నందున ముందస్తుగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గురువారం తొర్రూరులో ని సాయినగర్‌లో వైద్యశిబిరం ఏర్పాటుచేసి 112 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 19 మందికి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 

అన్నిశాఖలు అప్రమత్తం

  • కరోనా వైరస్‌పై అన్నిశాఖ వార్‌ ప్రకటిం చాయి. సౌధలో హ్యాండ్‌ శానిటైజేషన్‌ తర్వా తే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు.  
  • డీజీపీ కార్యాలయంలోని మినిస్టీరియల్‌ సిబ్బందికి రోజువిడిచి రోజు విధుల్లోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీఅయ్యాయి. 
  • నేషనల్‌ పోలీస్‌ అకాడమీలోకి బయటి వ్య క్తులకు అనుమతి లేదు. 229 మంది ట్రైనీ ఐపీఎస్‌లకు ఔట్‌డోర్‌ శిక్షణను రద్దుచేశారు.
  • ఈ నెల 21న విచారించే కేసులను వాయి దా వేస్తున్నట్టు మైనార్టీ కమిషన్‌ తెలిపింది.  
  • సాధారణ పరిస్థితులు వచ్చేవరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ రద్దుచేసింది.  
  • సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులందరికీ యజమాన్యాలు మాస్కులు, గ్లౌసు లు, మందులు అందజేయాలని రాష్ట్ర సంయుక్త కార్మిక కమిషనర్‌ ఎన్‌ చతుర్వేది ఆదేశించారు.
  • కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, వైద్య సిబ్బందితో సమన్వయంగా పనిచేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రైసా) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తిచేసింది.  


logo