బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 03:30:12

వరద ఆగితేనే ‘మిగులు’ తేలేది!

వరద ఆగితేనే ‘మిగులు’ తేలేది!

  • ప్రస్తుతానికి రెండు రాష్ర్టాల వినియోగాన్ని లెక్కిస్తున్న కృష్ణా బోర్డు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిన్నటిదాకా కృష్ణా మిగులు జలాలపై హడావుడిచేసిన కేంద్ర జల్‌శక్తి,    కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రస్తుతం స్తబ్దుగా ఉంటున్నాయి. ఊహించనిరీతిలో ఇన్‌ఫ్లోలు వస్తుండటంతో తాజాగా ఈ అంశాన్ని పక్కనపెట్టాలని నిర్ణయించారు. బేసిన్‌లో రెండేండ్లుగా బచావత్‌ కేటాయింపులకు మించి ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. మిగులుజలాలపై తేల్చాలంటూ ఏపీ జల వనరులశాఖ గతేడాది పట్టుబట్టడంతో కేంద్ర జల్‌శక్తి.. కమిటీని కూడా నియమించింది. కొన్ని రోజుల నుంచి కమిటీ ఈ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నది. 20 ఏండ్ల రికార్డులు ఇవ్వాలంటూ రెండు రాష్ర్టాలకు పదేపదే లేఖలు రాస్తూ ఒత్తిడి తెస్తున్నది. కమిటీకి వివరాలివ్వాలంటూ కృష్ణాబోర్డు అధికారులు కూడా రెండు రాష్ర్టాలకు ఇప్పటికే రెండు పర్యాయాలు లేఖలు రాసింది. అయితే ప్రస్తుతం కృష్ణాబేసిన్‌లో వరద పోటెత్తుతున్నది. శ్రీశైలం జలాశయం నుంచి 30-40 వేల క్యూసెక్కులను తరలించేందుకు ఎప్పుడూ ప్రయత్నించే ఏపీ జల వనరులశాఖ కూడా పెన్నా బేసిన్‌లోనూ భారీ వరదలు రావడంతో 2-3 వేల క్యూసెక్కుల డిశ్చార్జికే పరిమితమవుతున్నది. ఈ పరిస్థితుల్లో మిగులు జలాల లెక్కలపై హడావుడిచేయడం సమంజసం కాదని బోర్డు అధికారులు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. రెండురాష్ర్టాలు ప్రస్తుతం వాడుకుంటున్న నీటిని లెక్కలను నమోదుచేయడం వరకే పరిమితం కావాలని భావిస్తున్నారు. తదుపరి కేంద్ర జల్‌శక్తి మిగులు జలాలపై తుది నిర్ణయాన్ని వెలువరిస్తే ఆ మేరకు రెండు రాష్ర్టాల వినియోగ లెక్కలను సవరించాలని              నిర్ణయించారు.                      

గ్రీన్‌ చాలెంజ్‌లో సోనూసూద్‌

l  రామోజీ ఫిలిం సిటీలో మొక్కనాటిన సినీనటుడు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందని ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీనటుడు సోనూసూద్‌ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన మూడోవిడుత గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంగళవారం రామోజీ ఫిలిం సిటీలో సోనూసూద్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి ఈ మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటినందుకు ఆనందంగా ఉన్నదనిచెప్పారు. ఇదే స్ఫూర్తితో లక్షల మంది గ్రీన్‌ చాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటి, పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.logo