గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 25, 2020 , 02:01:58

మన సురవరం సూర్యుడే..!

మన సురవరం సూర్యుడే..!

ఆదిత్యుడు 

భూగోళమంతా తిరిగితే

సురవరం

భూగోళాన్నంతా కలంలో ఒంపిండు

గోల్కొండ గుండె నుంచి

జాలువారిన అక్షర సింగిడిలో

సకల భాషల సముద్రుడు

సకల చరిత్రల చంద్రుడు

సకల శాస్ర్తాల సూర్యుడు

కృష్ణా తుంగభద్రల నడుమ

ఇటిక్యాలపాడులో

ఇనబింభమై ఉదయించే

రేయి పగలు  సాహితీ ప్రభువై నడిచి

తెలుగు జాతిని మేల్కొల్పిన జాబిలి

గోల్కొండ

తెలంగాణ తల్లి తలమీద వజ్రాల కిరీటం

గోల్కొండ కవులసంచిక

అణగారిన వర్గాల తెలంగాణ ఆత్మగౌరవ పతాకం

నీ అడుగు లేని తెలుగు నేల

బొట్టులేని బోనం

నీ అక్షరం లేని సాహిత్యం

కావ్యంలేని గ్రంథాలయం

నిన్ను తలువని తెలంగాణ

సమురులేని దీపం

ఊరూరబైరాగై తిరిగి

భాషలలోని నిగ్గులను తెలుసుకొని

మూలన దాచిన దస్ర్తాల మూటలను దులిపావు

సాంఘీక చరిత్రను

అపూర్వ గ్రంథంగా అందించి

తెలుగు జనులకు పెద్దబాలశిక్షై నిలిచావు

శిల్పిలా 

ముడిరాయిని మలిచి 

శిల్పాచార్యుడవైనావు

రైతులా

తెలంగాణ బీడును  సేద్యం చేసి 

సాహితీ సేనాని వైనావు

అక్షర అధిపతివైనావు

మహానదివి నీవు

మా మహబూబ్‌నగర్‌ మట్టిగంధానివి

మహా వృక్షానివి నీవు

మా పాలమూరు పిల్లలమర్రివి

మహా శిఖరానివి నీవు

మాకు తెలంగాణ తోవవు నీవు

తెలుగుజాతి సూర్యుడు 

మన సురవరం ప్రతాపరెడ్డి

(25.08.2020 మంగళవారం

సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భంగా)

- వనపట్ల సుబ్బయ్య, 9492765358


logo