శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 20:25:41

సుప్రీం బెంచ్‌ ఏర్పాటుకు దక్షిణాది బార్‌ కౌన్సిల్స్‌ డిమాండ్‌

సుప్రీం బెంచ్‌ ఏర్పాటుకు దక్షిణాది బార్‌ కౌన్సిల్స్‌ డిమాండ్‌

హైద‌రాబాద్ : దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ను సత్వరమే ఏర్పాటు చేయాల‌ని దక్షిణ భారత బార్ కౌన్సిల్ ఛైర్మన్లు  సంయుక్తంగా డిమాండ్ చేశారు. ఈ మేర‌కు దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో సుప్రీంకోర్టు బెంచ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయాల‌న్నారు. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు బి. కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జూమ్ వెబినార్ ద్వారా ఆదివారం సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ వెబినార్ లో ముఖ్య వక్తలుగా తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఏ. నర్సింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఛైర్మన్ జీ. రామారావు, కేరళ బార్ కౌన్సిల్ ఛైర్మన్ కె. పి. జయ చంద్రన్, తమిళనాడు బార్ కౌన్సిల్ చైర్మన్ పి. అమల్ రాజ్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలనే చట్టబద్ధమైన డిమాండ్ పూర్వందేనని, ఈ అంశం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంద‌న్నారు. రాజ్యాంగం ప్రకారం న్యాయ సమ్మతి నిర్ణయాలను ప్రాథమిక హక్కులను కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. వాస్తవంగా సుప్రీంకోర్టు దూరం కారణంగా అప్పీల్ రేటు దక్షిణ రాష్ట్రాల నుండి 3.1శాతం మాత్రమే ఉన్నదని గణాంకాలు వెల్ల‌డిస్తున్నాయ‌న్నారు. సుప్రీంకోర్టు వేల కిలోమీటర్ల దూరంలో ఉండటం వ‌ల్ల ప్రయాణ సమయం,  ఖర్చు, వసతి సమస్య వంటి సమస్యలు నిత్యం న్యాయవాదులు ఎదుర్కొంటున్నారన్నారు. 

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అధికార పరిధిలో బెంచ్ నిర్ణయం  ఆవశ్యమని, ఈ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 130 ప్రకారం సీజేఐ, రాష్ట్రపతి ఆమోదంతో నిర్ణయం తీసుకోవచ్చన్నారు. 10వ లా కమిషన్ నివేదికలో జస్టిస్ కె కె మాథ్యూవ్,  11వ కమిషన్ నివేదికలో జస్టిస్ దేశాయ్, 18వ కమిషన్ నివేదికలో ఏ. ఆర్. లక్ష్మణన్ న్యాయమూర్తుల‌ నేతృత్వంలోని బృందం బెంచ్‌ను ఏర్పాటు చేయాలని నివేదించార‌న్నారు. అదే విధంగా పార్లమెంటరీస్థాయి సంఘం తన 2, 6, 15, 20, 26, 28 నివేధికల్లో దేశంలోని దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు ఉన్నాయని స్ప‌ష్టం చేశారు.

కాబట్టి వెంటనే ఈ బెంచ్ ఆవశ్యకతను లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి సత్వరమే దక్షిణాది ప్రాంతంలో సుప్రీం బెంచ్‌ను ఏర్పాటు చేయాలని అన్ని దక్షిణ రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఛైర్మన్లు తీర్మాణాన్ని ఆమోదింపజేశారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ సెమినార్‌లో దక్షిణ భారతదేశ సుప్రీంకోర్టు బెంచ్ సాధన సమితి కన్వీనర్‌గా ఏ. నర్సింహా రెడ్డి (తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్) ను, దక్షిణాది రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఛైర్మన్లు ఎన్నుకున్నారు.

VIDEOS

logo