మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 02:46:19

దివ్యాంగుల సంక్షేమానికి రూ.కోటి

దివ్యాంగుల సంక్షేమానికి రూ.కోటి

హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ వెల్లడి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కోటి రూపాయలు మంజూరుచేసినట్టు అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ పింఛన్లతోపాటు ఆహారభద్రత కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం, రూ.1500 అందజేసినట్టు తెలిపారు.  దివ్యాంగులను ఆదుకోవాలని దాఖలైన పిటిషన్‌ను.. చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. దివ్యాంగుల కోసం జిల్లా అధికారుల వద్ద ఉంచిన నిధులు సరిపోవని అభిప్రాయపడింది. 

వలస కార్మికులను ఆదుకోండి

వలస కార్మికుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యతని, వారు సొంత ప్రాంతాలకు చేరుకొనేలా చేయూత అందించాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు పేర్కొన్నది. మేడ్చల్‌ హైవేపై నడుచుకుంటూ వెళ్తున్నవారిని గుర్తించి తాత్కాలిక వసతికేంద్రాలకు తరలించాలని సూచించింది. వలస కార్మికులను స్వగ్రామాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్‌ రమాశంకర్‌ నారాయణ్‌ మేల్కొటే హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ..  ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఏ ఒక్క కార్మికుడిని సరిహద్దుల్లో వదిలేయలేదని తెలిపారు. 

గూడ్స్‌ రైళ్లలో పండ్లను తరలించండి

రాష్ట్రంలో పండ్లను గూడ్స్‌రైళ్లలో తరలించే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాష్ట్రంలో మొత్తం మామిడి, బత్తాయి, ఇతర పండ్ల ఎగుమతి ఎంత, రాష్ట్ర పరిధిలో అందుబాటులో ఉన్న గూడ్స్‌రైళ్లు వంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ను ఆదేశించింది. 


logo