శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 15:06:40

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర : ఎమ్మెల్యే ఆత్రం సక్కు

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర : ఎమ్మెల్యే ఆత్రం సక్కు

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పలు జిన్నింగ్ మిల్లుల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు పూజలు నిర్వహించి కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం సీసీఐ ద్వారా నిర్ణయించిన మద్దతు ధరకే రైతులు తమ పత్తిని విక్రయించాలని సూచించారు. తేమ శాతం 12 లోపు ఉండేలా  చూసుకోవాలని రైతులను కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 5,825 రూపాయలకు మాత్రమే రైతులు తమ పత్తిని విక్రయించాలని, బయట దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.

ప్రతిరోజూ జిన్నింగ్ మిల్లుల్లో వ్యవసాయ అధికారులు,  మార్కెట్ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పత్తి పంట పూర్తిగా కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. పత్తిని విక్రయించేందుకు వచ్చిన రైతులు తమ పట్టా పాసుపుస్తకాలు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు జిరాక్స్ను తీసుకుని రావాలన్నారు.