బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 02:43:18

సంక్షోభంలోనూ సంక్షేమం

సంక్షోభంలోనూ సంక్షేమం

  • లాక్‌డౌన్‌తో ఆదాయం తగ్గినా.. ఆగని పథకాలు
  • ఆసరా పింఛన్లు, కరోనా సాయం,రైతుబంధుతో అండ
  • అదనంగా పంటల కొనుగోలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ఒక వైపు కరోనా మహమ్మారి దాడి.. మరోవైపు లాక్‌డౌన్‌.. ఒక వైపు రోగులకు వైద్యమందించాలి.. ఇంకోవైపు పేదల సంక్షేమాన్ని విడిచిపెట్టవద్దు.. ఒకవైపు ఆదాయం పడిపోయింది.. మరొకవైపు కేంద్రం పైసా విదిలించలేదు రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజవేయలేదు. మడమతిప్పలేదు. ఓ పక్క కరోనాను ఎదుర్కోవడానికి వైద్యపరంగా సకల సౌకర్యాలు కల్పించింది. మరోవైపు సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించింది. ఒక్కో రూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెడుతూ.. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కునారిల్లకుండా అప్రమత్తంగా ఉంటూ.. పేదల ఆకలిని తీర్చగలిగింది. ఆసరా పింఛన్లను యథావిధిగా విడుదలచేసింది. 

పేద కుటుంబాలకు కరోనా సహాయాన్ని అందించింది. దీంతోపాటు రైతుబంధుకూ నిధులు విడుదలచేసింది. గత మూడు మాసాల్లో ఈ మూడు పథకాలకే రూ.15,218 కోట్లు వెచ్చించింది. ఫిబ్రవరి వరకు సగటున రాష్ర్టానికి ప్రతినెల రూ.10 వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌ సమయంలో ఆదాయం పూర్తిగా పడిపోయింది. పన్నుల్లో వాటాగా ఏప్రిల్‌, మే నెలలకు కలిపి రూ.1,964 కోట్లు మాత్రమే వచ్చింది. కేంద్రం అదనంగా ఇచ్చింది ఏమీలేదు. ఇంతటి సంక్షోభంలోనూ ప్రభుత్వం సంక్షేమాన్ని ఆపలేదు. ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూర్చింది. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పడానికి ఇది మరో నిదర్శనం. 

అన్నదాతలకు రూ.6,900 కోట్లు 

కష్టకాలంలోనూ ప్రభుత్వం రైతులకు రికార్డుస్థాయిలో చెల్లింపులుచేసింది. ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు సాయాన్ని విడుదల చేసింది. ఒక్కరోజే 50.84 లక్షల మంది ఖాతాల్లో రూ.5,294 కోట్లు జమచేసింది. ఇప్పటిదాకా 54.21 లక్షల రైతులకు రూ.6,886.19 కోట్లు అందాయి. మిగతావారికి కూడా త్వరలోనే రైతుబంధు అందనున్నది. మరోవైపు రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలుచేసింది. వడ్ల కొనుగోలుకే రూ.12 వేల కోట్లు చెల్లించింది. అన్ని పంటలకు కలిపి రూ.20 వేల కోట్లమేర రైతులకు ఆదాయం వచ్చింది. 

ఆగని ఆసరా

ఆసరా పథకం కింద 38,49,867 మంది లబ్ధిదారులు ఉన్నారు. దివ్యాంగులకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడీ కార్మికులు, బోదకాలు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు రూ.2,106 పెన్షన్‌ ఇస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా దాదాపు రూ.855 కోట్లు వ్యయంచేస్తున్నది. లాక్‌డౌన్‌ కొనసాగిన మూడు నెలల్లో కలిపి రూ.2,500 కోట్లకుపైగా పేదలకు అందజేసింది.    

ప్రతి కుటుంబానికి పట్టెడన్నం 

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు రెండు నెలలపాటు రూ.1,500 చొప్పున మొత్తం రూ.1,200 కోట్లు పంపిణీచేశారు. తెల్లరేషన్‌కార్డున్న ప్రతి లబ్ధిదారుడికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని మూడు నెలలపాటు ఇచ్చారు. మొత్తం 3.3 లక్షల టన్నుల బియ్యాన్ని రూ.1,103 కోట్లు ఖర్చుచేసి ఉచితంగా సరఫరాచేసింది. వలసకార్మికులనూ ఆదుకొన్నది. మొత్తం రూ.5,767 కోట్లు ఖర్చుపెట్టింది. logo