గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Jul 19, 2020 , 02:12:07

నాకే 109 ఎమ్మెల్యేల మద్దతు

నాకే 109 ఎమ్మెల్యేల మద్దతు

  • రాజస్థాన్‌ గవర్నర్‌కు సీఎం గెహ్లాట్‌ నివేదన!
  • కాంగ్రెస్‌, బీజేపీ మధ్య విమర్శల వేడి
  • నోరు విప్పిన వసుంధర.. కాంగ్రెస్‌పై ఫైర్‌
  • సీఎం గెహ్లాట్‌ అనుచరులకు ఐటీ సమన్లు

జైపూర్‌, జూలై 18: రాజస్థాన్‌లో సచిన్‌పైలట్‌ తిరుగుబాటుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పటికీ ఇప్పటికీ తనకు 109మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని సీఎం అశోక్‌గెహ్లాట్‌ చెప్తున్నారు. శనివారం రాత్రి గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిసిన ఆయన తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందజేసినట్టు సమాచారం. భారతీయ ట్రైబల్‌ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలూ తనకే మద్దతు ఇస్తున్నారని గెహ్లాట్‌ ప్రకటించారు. సాధారణ సమావేశమేనని సీఎం కార్యాలయ వర్గాలు ప్రకటించినప్పటికీ బల నిరూపణ కోసమే సీఎం వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. కాగా, ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. రాజకీయ సంక్షోభంపై బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజే మొదటిసారి నోరు విప్పారు. మరోవైపు సచిన్‌పైలట్‌ నాయకత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు హర్యానానుంచి కర్ణాటక తరలివెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ప్రజలను పట్టించుకోరా..?

గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వసుంధరారాజే ఎట్టకేలకు శనివారం మౌనం వీడారు. ‘కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభంవల్ల రాజస్థాన్‌ ప్రజలు కష్టాలు పడుతుండటం దురదృష్టకరం. రాష్ట్రంపై కరోనా, మిడతలు దాడులు చేస్తున్నవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటల్లో మునిగి ఉన్నది. ఈ సంక్షోభానికి బీజేపీపై నేరం మోపి బురద అంటించే ప్రయత్నం చేస్తున్నది’ అని విమర్శించారు. గెహ్లాట్‌ ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేత సంబిత్‌ పాత్రా డిమాండ్‌ చేశారు. ఇంకోవైపు రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్‌చేశారు.

గెహ్లాట్‌ అనుచరులకు ఐటీ సమన్లు

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అనుచరులకు ఆదాయం పన్ను విభాగం శనివారం సమన్లు జారీచేసింది. గెహ్లాట్‌కు అత్యంత సన్నిహితులపై రతన్‌కాంత్‌ శర్మ, సునీల్‌ కొఠారీ, రాజీవ్‌ అరోరా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ధర్మేంద్ర రాతోడ్‌కు విచారణు హాజరుకావాలని ఆదేశాలు అందాయి. వీరి ఇండ్లపై ఇటీవలే ఐటీ సోదాలు జరిగాయి.


logo