బుధవారం 27 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 15:34:55

అభివృద్ధికి అండగా నిలవాలి : మంత్రి కేటీఆర్‌

అభివృద్ధికి అండగా నిలవాలి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి నగర పౌరులు అండగా నిలవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హోటల్‌ హరిత ప్లాజాలో కల్చర్‌ లాంగ్వేజ్‌ ఇండియా కనెక్షన్స్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ పాత, కొత్త సంస్కృతుల కలబోత. అన్ని భాషలు, సంస్కృతుల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. విశ్వనగరం దిశగా అభివృద్ధి అడుగులు పడుతున్నాయి.

హైదరాబాద్‌లో 95 శాతం మంచినీటి సమస్యను తీర్చినట్లు తెలిపారు. గండిపేట రిజర్వాయర్‌ కంటె రెట్టింపు స్థాయిలో కేశవాపూర్‌ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కేశవాపూర్‌ రిజర్వాయర్‌ పూర్తిచేసి నగరంలో రోజు మంచినీటి సరఫరా చేస్తామన్నారు. గతంలో మత ఘర్షణల వల్ల హైదరాబాద్‌లో కర్ఫ్యూలు విధించేవారు. ఆరేళ్లుగా సీఎం కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో అగ్గి రాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. విధ్వంసం క్షణాల్లో పని.. నిర్మించడం చాలా కష్టం అన్నారు. ఎన్నికల కోసం కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. హైదరాబాద్‌కు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఏం చేసిందో చెప్పాలన్నారు. హైదరాబాద్‌కు ఏం చేసిందో చెప్పమంటే దేశ భక్తి గురించి మాట్లాడుతారన్నారు.

కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తోంది. ఫిట్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా అంటూ ఆఖరికి బేజో ఇండియా అంటున్నారన్నారు. ప్రధాని ప్రకటించిన కరోనా ప్యాకేజీ రూ. 20 లక్షల కోట్లలో ఏ ఒక్కరికీ రూపాయి కూడా ఎవరికి రాలేదన్నారు. హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పమంటే బీజేపీ దగ్గర విషయం లేదు. విషయం లేదు కాబట్టే విద్వేషాలు సృష్టించేందుకు శ్రమిస్తున్నరన్నారు. విద్యావంతులు ఓటు వేయరని ప్రచారం దాన్ని తప్పు అని నిరూపిస్తూ మీరే కాకుండా, మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టుప్రక్కల వాళ్లను పోలింగ్‌కు తీసుకురావాలన్నారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. భిన్న సంస్కృతుల నగరం ఇది. పూలబొకే వంటి హైదరాబాద్‌లో యూనిటీ టవర్‌ను నిర్మిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.


logo