బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 03:52:58

ఆధారాల గుట్టురట్టు!

ఆధారాల గుట్టురట్టు!
  • కీలక కేసుల ఛేదనలో సూపర్‌లైట్‌ టెక్నాలజీ.. ఇటీవల కరీంనగర్‌ రాధిక కేసు పరిష్కారం
  • దేశంలోనే అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న తెలంగాణ పోలీస్‌ క్లూస్‌టీం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నేరాలకు పాల్పడే దుండగులు కొందరు కేసులనుంచి తప్పించుకునేందుకు పక్కాగా స్కెచ్‌వేస్తారు. రక్తపుమరకలు తుడిచివేయడం, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని మాయంచేయడం, సాక్ష్యాధారాలేవీ లేకుండాచేయడం వంటిచర్యలకు పాల్పడుతారు. ఇటువంటి కరుడుగట్టిన నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు పెద్దసవాలు. అయితే ఎన్నో సంక్లిష్టమైన కేసులను సాంకేతికసాయంతో ఛేదించి భేష్‌ అనిపించుకుంటున్నారు తెలంగాణ పోలీసులు. రాష్ట్రపోలీసులు ఉపయోగిస్తున్న ‘సూపర్‌లైట్‌ టెక్నాలజీ’ దేశంలోనే ఆధునికమైనది. ఇటీవల కరీంనగర్‌లో రాధిక అనే యువతి హత్యకేసును ఇదే సూపర్‌లైట్‌ టెక్నాలజీ సాయంతో ఛేదించారు. రాధిక తండ్రి ముత్తకొమురయ్య రక్తపుమరకలు అంటిన తన బనీనును ఉతికేసినా ఈ టెక్నాలజీతో హైదరాబాద్‌ క్లూస్‌టీం పోలీసులు పట్టుకున్నారు. 


పైకి కనిపించని  మరకలను పట్టేస్తుంది

జర్మనీకిచెందిన ఈ సూపర్‌లైట్‌ టెక్నాలజీని 2017 నుంచి హైదరాబాద్‌ సిటీ   పోలీసులు వినియోగంలోకి      తెచ్చారు. సామర్థ్యాన్నిబట్టి రెండురకాల సూపర్‌లైట్లను    వాడుతున్నారు. 


సూపర్‌లైట్‌ ఇలా పనిచేస్తుంది..

క్రైంసీన్‌లో పూర్తిగా వెలుతురు లేకుండాచేసి, అప్పుడు సూపర్‌లైట్‌ వేస్తారు. సూపర్‌లైట్‌ నీలంరంగు వెలుతురులో ఆ ప్రాంతంలోని రక్తపు మరకలను నల్లటి రంగులో గుర్తిస్తుంది.

రక్తపు మరకలతోపాటు వీర్యం, వెంట్రుకలు, బూటు లేదా కాలిముద్రలు, వేలిముద్రలను ఈ సూపర్‌లైట్‌తో గుర్తించవచ్చు.కేవలం గోడలు, నేలపైనే కాకుండా దుస్తులపై చెరిపివేసిన మరకలు సైతం కనిపిస్తాయి. ఇలా మరకలను గుర్తించిన తర్వాత సూపర్‌లైట్‌ను ఆర్పివేసి, ఆ మరకలపై బ్లూస్టార్‌ లేదా ల్యుమినాల్‌ అనే ద్రావణాలు చల్లుతారు. అప్పుడు ఆధారాలు ఉన్న ప్రదేశం నీలం రంగులోకి మారుతుంది. 


ఇలా శాంపిల్స్‌ను సేకరిస్తారు. 

ఈ సూపర్‌లైట్‌ టెక్నాలజీని దిశ కేసులోనూ క్లూస్‌   సిబ్బంది కీలకంగా వాడారు. 2018 ఫిబ్రవరిలో ఉప్పల్‌లో కలకలంరేపిన బాలిక నరబలి కేసులోనూ కీలక ఆధారాలు ఈ సూపర్‌లైట్‌ టెక్నాలజీతోనే కనుగొన్నారు. నిందితుడు క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్‌ తన ఇంట్లో రక్తపుమరకలను కడిగేసినప్పటికీ బండలమధ్య సందుల్లో ఉన్న రక్తపు అవశేషాలను ఈ సాంకేతికతతో గుర్తించిన విషయం తెలిసిందే. 


30వాట్స్‌ సామర్థ్యం ఉన్న సూపర్‌లైట్లు చిన్నవి.

ఇవి ప్రస్తుతం ప్రతిజిల్లాలోనూ అందుబాటులో ఉన్నాయి. 200 వాట్స్‌తో కూడిన అత్యంత శక్తిమంతమైన సూపర్‌లైట్‌ కేవలం హైదరాబాద్‌ క్లూస్‌టీం వద్ద మాత్రమే ఉన్నది. దీనిని కీలక కేసుల దర్యాప్తులో వాడుతున్నాం.

- డాక్టర్‌ వెంకన్న, హైదరాబాద్‌ క్లూస్‌టీం హెచ్‌వోడీ

logo