శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 03:47:52

గాలివాన బీభత్సం

గాలివాన బీభత్సం
  • మక్కజొన్న, వరి పంటలకు నష్టం
  • సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటు.. యువకుడి మృతి

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం తర్వాత కురిసిన వర్షానికి చాలాచోట్ల మక్కజొన్న, వరి తదితర పంటలను నష్టంవాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఓ యువకుడు మరణించాడు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంతోపాటు కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, మానకొండూర్‌, తిమ్మాపూర్‌, శంకరపట్నం, గన్నేరువరం, చొప్పదండి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలు గ్రామాల్లో ఇండ్లు, షెడ్లపై రేకులు ఎగిరిపోయాయి. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి. రామడుగు, గంగాధర, వీణవంకలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మానకొండూర్‌ మండలం గంగిపల్లి, శంకరపట్నం మండలంలో కన్నాపూర్‌లో వడగండ్లు కురవడంతో మక్కజొన్న, వరి పంటకు నష్టం వాటిల్లింది. 


తడిసిన కందులు..

ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. స్థానిక మార్కెట్‌ యార్డులో విక్రయించేందుకు తీసుకొచ్చిన కందులు తడిసిపోయాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని కుమ్మరోనిపల్లి, తిర్మలాపూర్‌ మాచారం తదితర గ్రామా ల్లో భారీ వర్షం కురిసింది. మెదక్‌ జిల్లా రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని కాట్రియాల పర్వతాపూర్‌, ఝాన్సీలింగాపూర్‌ గ్రామాల్లో భారీ వర్షానికి స్తంభాలు ధ్వంసం అయ్యాయి. మక్కజొన్న నేలకొరిగింది. 

F నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లో పది నిమిషాలపాటు భారీగా వర్షం కురువగా.. జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల్లో స్వల్పంగా పడింది. బోధన్‌ మండలం సాలూర, కల్దుర్కి, పెగడాపల్లి ఓ మోస్తరు వాన పడింది. కోటగిరి మండ లం సోంపూర్‌లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్టు పడటంతో ఓ ఇంటి గోడ కూ లింది. ఎడపల్లి మండలంలో అరగంటపాటు వర్షం కురిసింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరగ్గా, రేకులషెడ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, గాంధారి మండలాలతోపాటు బాన్సువాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. 


పిడుగుపాటుకు యువకుడి మృతి 

రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని ఓ అద్దె ఇంటిలో ఉంటున్న బొప్పాపూర్‌కు చెందిన మహ్మద్‌ అస్లాం(20) బంగ్లాపైకి ఎక్కి సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పిడుగుపడి మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో బాలుడికి గాయాలయ్యాయి.


బోధన్‌లో అత్యధికం..

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో అత్యధికంగా 3.9 సెం.మీ., కరీంనగర్‌ జిల్లాలో 3.0సెం. మీ., మెదక్‌ జిల్లా రామాయంపేటలో 2.9 సెం.మీ., యాదాద్రి భువనగిరి, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో 2.7 సెం.మీ., రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.2 సెం.మీ., గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 1.7 సెం.మీ., చొప్పున వర్షపాతం నమోదైంది.

logo